లాయర్ వృత్తినే వదిలేసి.. 2000కు పైగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్న యువ‌తి

Thu,May 9, 2019 04:53 PM

Bihar Lawyer Quits Practice and Educates 2000 more Underprivileged Kids For Free

మీ చిన్నతనం నుంచి పెరిగి పెద్దయ్యే వరకు మీ సంతోషకరమైన జ్ఞాపకాలు ఏంటి? ఎటువంటి బాధలు, బాధ్యతలు, భారాలు లేకుండా పెరగడమే.. అంటారా? కరెక్ట్. కానీ.. అందరూ గోల్డెన్ స్పూన్‌తో పుట్టరు కదా. కొందరికి కష్టాలు ఉండకపోవచ్చు.. మరికొందరు కష్టాలతోనే తమ చిన్నతనాన్ని నెట్టుకువచ్చిఉండొచ్చు. నెట్టుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే.. వాళ్లు పుట్టేదే కడు పేదరికంలో. ఇక.. చదువు అంటేనే వాళ్లకు అందని ద్రాక్ష. అటువంటి వాళ్లు బీహార్‌లో కోకొల్లలుగా ఉన్నారు.

వాళ్లంతా నిరుపేదల పిల్లలు. ఆ పిల్లలకు చదువు చెప్పించడం కన్నా.. ఏదో ఒక పనికి పంపిస్తే నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చని అనుకునే తల్లిదండ్రులు.. అలా చదువంటే ఏంటో తెలియకుండా.. జీవితాంతం గొడ్డు చాకిరి చేస్తూ.. ప్రతి రోజూ గంజికి ఏడ్వాల్సిందే ఆ పిల్లలు. అటువంటి పిల్లలను చూసి 30 ఏళ్ల సరితా రాయ్‌కి కళ్లు చెమర్చాయి. వీళ్ల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నది. అందుకే.. తన లాయర్ వృత్తిని కూడా పక్కనబెట్టింది. ఆ పిల్లలకు అన్నీ తానైంది. ఇప్పుడు 2000 మందికి పైగా నిరుపేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. పదండి... ఓసారి బీహార్ వెళ్లి.. సరితా రాయ్ గొప్పతనం గురించి తెలుసుకుందాం.

బీహార్‌లోని ఓ సిటీ పేరు హజీపూర్. నిజానికి.. సరితది హజీపూర్ అయినప్పటికీ.. ఆమె అక్కడ గడిపిన రోజులు తక్కువ. ఆమె అక్కడ ఉన్నదీ లేదు. తన నాన్న ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ కావడంతో ఆమె నార్త్‌ఈస్ట్‌లో ఎక్కువగా ఉంది. అప్పుడప్పుడు తన సొంతూరుకు వెళ్లేది. కానీ.. అక్కడ మహిళలు పడుతున్న బాధలు, పిల్లలు చదువుకు దూరమవడం.. అన్నీ తన కళ్లతో చూసేది. ముఖ్యంగా అక్కడ తమ పిల్లలకు చదువెందుకులే.. అని అనుకునే తల్లిదండ్రులే ఎక్కువ అని మనం ముందే చదువుకున్నాం కదా.. అదే ఆమెను తన సొంతూరుకు వచ్చేలా చేసింది. తన లాయర్ వృత్తిని వదిలేసి.. హజీపూర్‌లో టాపర్ స్టడీ పాయింట్(ఉదాన్)ను ప్రారంభించింది. ఆరో క్లాస్ వరకు ఉచితంగా పిల్లలకు పాఠాలు చెప్పడమే ఆ స్టడీ పాయింట్ లక్ష్యం.

గత 8 సంవత్సరాల నుంచి బీహార్‌లోని మారుమూల ప్రాంతాల్లో పిల్లల చదువు కోసం పాటుపడుతోంది సరిత. పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వడం కంటే అదృష్టం ఇంకేముంటుంది. వాళ్లకు మంచి చదువును ఇవ్వడం అంటే.. జీవితాన్ని ఇవ్వడం.. అని నమ్ముతుంది సరిత.

బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ.. కొన్ని గ్రామాల్లో అమ్మాయిలకు చదువెందుకు, అమ్మాయిలకు ఎక్కువ స్వేచ్ఛనివ్వొద్దు.. అనే మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారు. అమ్మాయిలు గ్రామాల్లో సైకిల్ కూడా తొక్కకూడదట. అలా ఉంటాయి అక్కడి పరిస్థితులు. వాటన్నింటినీ నేను మార్చేయాలనుకున్నా. అందుకే నేను లా చదివా. కానీ.. వెతుక్కుంటూ వచ్చిన ఎన్నో ఉద్యోగాలను వదిలేశా. సోషల్ ఎంట్రీప్రెన్యూర్‌గా మారా.. అంటూ చెప్పుకొచ్చింది సరిత.

నా ఇంట్లోనే పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రారంభించా. అమ్మాయిల నుంచి ఎటువంటి ఫీజు తీసుకోలేదు కానీ.. అబ్బాయిల నుంచి మాత్రం పుస్తకాల కోసం కొంత ఫీజు తీసుకునేదాన్ని. అలా నాలుగేళ్లు పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెప్పాక.. ఎడ్యుకేషన్ సంస్థను ప్రారంభించా. అలా.. 2009లో టాపర్ స్టడీ పాయింట్‌ను ఏర్పాటు చేశా.. అని సరిత వెల్లడించింది.

తల్లిదండ్రులను ఒప్పించడమే పెద్ద సవాల్


అయితే.. సరిత అనుకోగానే.. పిల్లలు వచ్చి తన దగ్గర చదువు చెప్పించుకోలేదు. తన ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు. ముఖ్యంగా.. పిల్లల తల్లిదండ్రులను ఒప్పించడానికి సరితకు చాలా కష్టమయ్యేది. వాళ్లు ముందు అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే.. తమ పిల్లలు చదువు అంటూ తిరిగితే.. పని ఎవరు చేయాలి.. డబ్బులు ఎట్లా వస్తాయి.. అంటూ ఒప్పుకునేవారు కాదు. కాకపోతే.. వాళ్లను ఒప్పించడంలో సక్సెస్ అయింది సరిత. హజీపూర్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఒక్కరిని బతిమిలాడి మరీ.. వాళ్ల పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించింది సరిత.

సాధారణంగా పాఠశాలల్లో బోధించే విద్య కన్నా.. సమాజం విలువలు, మర్యాద, ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, పిల్లల హక్కులేంటి, న్యాయ వ్యవస్థ అంటే ఏంటి.. అనే విషయాలనే ఆమె బోధించేది. తన ఇన్‌స్టిట్యూట్‌లో ఆరో తరగతి పూర్తయిన పిల్లలకు మంచి స్కూల్స్‌లో అడ్మిషన్ కూడా ఇప్పిస్తుంది సరిత.

ఇప్పటి వరకు పిల్లల చదువు కోసం కొన్ని ప్రైవేటు సంస్థలు సరితకు సాయం చేస్తున్నాయి. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, యూనిఫాం లాంటివి అందిస్తున్నాయి. పిల్లలకు చదువు చెప్పడంతో పాటు.. బీహార్ రాష్ట్ర ప్రభుత్వ జువెనైల్ జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది సరిత. అయితే.. అందులో పనిచేయగా వచ్చే డబ్బులను సరిత.. తన ఇన్‌స్టిట్యూట్‌కే కేటాయిస్తోంది. నలుగురు వాలంటీర్లతో ఇప్పటి వరకు 2000 మందికి పైగా పిల్లలకు తన సంస్థ ద్వారా చదువు చెప్పిస్తోంది సరిత.

ఈ భూమ్మీద పుట్టినందుకు.. తన కోసం కాకుండా.. పది మంది కోసం ఎలా బతకాలో సరిత చేసి చూపిస్తోంది. ఆమెలా ఆలోచించేవాళ్లు ఉంటే.. ఈ దేశం త్వరలోనే అద్భుతమైన దేశంగా మారుతుంది. అందులో డౌటే లేదు. ఆమె ఇలాంటి పేద పిల్లలెందరికో మంచి భవిష్యత్తును ఇవ్వాలని మనమూ కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సరిత.

1611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles