అడ్వ‌కేట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన రామ్‌నాథ్‌



Mon,June 19, 2017 02:53 PM
అడ్వ‌కేట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన రామ్‌నాథ్‌

హైద‌రాబాద్ : బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్ నాథ్ కోవింద్ 1945, అక్టోబ‌ర్ 1న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో జ‌న్మించారు. అడ్వ‌కేట్‌గా ఆయ‌న కెరీర్‌ను మొద‌లుపెట్టారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వ‌ర‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అడ్వ‌కేట్‌గా ఉన్నారు. 1980 నుంచి 93 వ‌ర‌కు ఆయ‌న సుప్రీంకోర్టులో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టాండింగ్ కౌన్సిల్ స‌భ్యుడిగా ఉన్నారు. 1978లో ఆయ‌న సుప్రీంకోర్టులో అడ్వ‌కేట్‌-రికార్డ్‌గా ప‌నిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయ‌న 16 ఏళ్లు ప‌నిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో 1971లో రామ్‌నాథ్ న్యాయ‌వాదిగా పేరు న‌మోదు చేసుకున్నారు.

రామ్‌నాథ్ రాజ‌కీయ కెరీర్ 1994లో మొద‌లైంది. యూపీ నుంచి రాజ్య‌స‌భకు ఎంపీగా ఎంపిక‌య్యారు. 2006 వ‌ర‌కు ఎంపీగా ఆయ‌న రెండుసార్లు చేశారు. పార్ల‌మెంట్‌కు చెందిన అనేక క‌మిటీల్లోనూ ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. పార్ల‌మెంట్‌కు చెందిన‌ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌, హోంశాఖ‌, పెట్రోల్ మ‌రియు ఇంధ‌నం, సామాజిక న్యాయం, లా అండ్ జ‌స్టిస్‌, రాజ్య‌స‌భ హౌజ్ క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. రామ్‌నాథ్ భార్య పేరు స‌వితా కోవింద్‌. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఎన్డీఏ పార్టీ ఇవాళ రామ్‌నాథ్‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

రామ్‌నాథ్ కోవిందే ఎందుకు?
ఎన్డీయే త‌మ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎవ‌రూ ఊహించ‌ని రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నిజానికి ఎన్నో పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి, సుష్మా స్వ‌రాజ్‌, జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము పేర్ల‌ను బీజేపీ ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎన్నో చ‌ర్చ‌ల త‌ర్వాత బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రామ్‌నాథ్ పేరును బీజేపీ ప్ర‌క‌టించింది. దీని వెనుక బ‌ల‌మైన వ్యూహ‌మే ఉంది. రామ్‌నాథ్ ద‌ళితుడే కాదు రైతుబిడ్డ కూడా. యూపీలోని కోలి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్యక్తి. వివాదర‌హితుడిగా పేరుంది. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీలు నో చెప్ప‌లేని ప‌రిస్థితిని మోదీ క‌ల్పించారు.

యూపీ, బీహార్‌ల‌లో బీజేపీకి ఎన‌లేని సేవ‌లందించారు. పార్టీ ద‌ళిత‌వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హించారు. యూపీలో ఒక‌ప్పుడు మాయావ‌తి కుల రాజ‌కీయాల‌కు రామ్‌నాథ్‌తోనే చెక్ పెట్టాల‌ని బీజేపీ భావించింది. ఇక కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో స‌న్నిహితంగా ఉండ‌టం కూడా ఆయ‌నకు క‌లిసొచ్చింది. ఇక బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా చేసిన అనుభ‌వం కూడా ఆయ‌న‌కు ప‌నికొస్తుంది. సోమ‌వారం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు రెండున్న‌ర గంట‌ల పాటు స‌మావేశ‌మై రామ్‌నాథ్ పేరును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న జూన్ 23 నామినేష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది. ఆయ‌న పేరుపై ఏకాభిప్రాయం సాధిస్తామ‌న్న విశ్వాసాన్ని అమిత్ షా వ్య‌క్తంచేశారు.

2216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS