క్యారీ బ్యాగ్‌కు రూ.3 చార్జ్ చేసిన బాటా.. 9 వేలు ఫైన్ వేసిన వినియోగదారుల ఫోరమ్

Mon,April 15, 2019 04:15 PM

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను వాడొద్దని.. దానికి బదులు పేపర్ బ్యాగ్స్ వాడాలని.. లేదంటే పర్యావరణానికి హానీ చేయని బ్యాగ్స్‌ను వాడాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. దీంతో కొన్ని షాపింగ్ మాల్స్, స్టోర్స్.. పర్యావరణ సహిత బ్యాగులను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే.. పర్యావరణ సహిత బ్యాగుల ధర ఎక్కువగా ఉండటంతో వాటిని స్టోర్స్ భరించకుండా కస్టమర్ల మీద రుద్దుతున్నాయి.


క్యారీ బ్యాగ్ కావాలంటే ఖచ్చితంగా కస్టమర్ వాళ్లు నిర్ధేశించిన ధర చెల్లించాల్సిందే. ఆ బ్యాగ్ మీద కూడా వాళ్ల బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే విధంగా కంపెనీ లోగోను ముద్రించడం లాంటివి చేస్తున్నారు. అంటే కస్టమర్ డబ్బులు ఇచ్చి మరీ వాళ్ల బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడన్నమాట. ఇదిగో ఇక్కడే మండింది ఓ కస్టమర్‌కు. దీంతో బాటా కంపెనీని వినియోగదారుల ఫోరమ్‌కు లాగాడు. దీంతో ఫోరమ్ బాటా కంపెనీకి 9 వేల రూపాయల ఫైన్ వేయడంతో పాటు ఇక నుంచి కస్టమర్లకు ఉచితంగా బ్యాగ్స్ ఇవ్వాలని ఆదేశించింది.

అసలేంజరిగిందంటే.. చండీగఢ్‌కు చెందిన దినేశ్ ప్రసాద్ రాటురి నోయిడా సెక్టార్ 22డీలో ఉన్న బాటా షోరూంలో షూ కొన్నాడు. షూ ఖరీదు 399 రూపాయలు అయినప్పటికీ.. 402 రూపాయలను దినేశ్ నుంచి వసూలు చేశారు. ఇదేంటంటే.. క్యారీ బ్యాగ్‌కు 3 రూపాయలు అన్నారు. దీంతో మనోడికి తిక్కలేసింది. క్యారీ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాల్సింది పోయి.. 3 రూపాయలు తీసుకుంటారా? డబ్బులు తీసుకొని మరీ.. దాని మీద కంపెనీ లోగోను ముద్రించి ప్రమోట్ చేసుకుంటారా? అని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశాడు.

దానిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరమ్.. బాటాపై మండిపడింది. కస్టమర్లకు ఉచితంగా క్యారీ బ్యాగ్స్ ఇవ్వకుండా వాళ్ల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించింది. పర్యావరణం మీద మీకు అంత బాధ్యత ఉంటే.. పర్యావరణ హిత బ్యాగులను ఉచితంగా పంచండి.. మీ ఉత్పత్తులు కొంటున్నప్పుడు.. క్యారీ బ్యాగ్స్ ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత మీదే.. అంటూ మొట్టికాయలు వేసింది. ఇప్పటి నుంచి కస్టమర్లందరికీ ఉచితంగా క్యారీ బ్యాగ్స్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అంతే కాదు.. ఫిర్యాదుదారుడి నుంచి తీసుకున్న క్యారీ బ్యాగ్ ధర 3 రూపాయలు, దాంతో పాటు ఫిర్యాదు కోసం ఖర్చు పెట్టిన 1000 రూపాయలు, కస్టమర్ తన సమయాన్ని వృథా చేసుకొని ఫోరమ్ చుట్టూ తిరిగి మానసికంగా ఇబ్బందులకు గురయినందుకు 3000 రూపాయలను ఫిర్యాదుదారుడికి నష్టపరిహారంగా ఇవ్వాలంటూ బాటాను ఆదేశించింది. అంతే కాదు.. రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్ అకౌంట్‌లో 5000 డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింది. దీంతో బాటా మొత్తం 9003 రూపాయల ఫైన్ కట్టాల్సి వచ్చింది.

కస్టమర్ల నుంచి బలవంతంగా క్యారీ బ్యాగ్స్ డబ్బులు వసూలు చేస్తున్న షాపింగ్ మాల్స్, స్టోర్స్‌కు ఇది కనువిప్పు కలిగే ఘటనే. చూద్దాం.. ఈ ఘటన తర్వాత అయినా ఇతర స్టోర్స్ కస్టమర్లకు ఉచితంగా క్యారీ బ్యాగ్స్ ఇస్తాయో?

4874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles