అరుణ్‌జైట్లీకి క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

Mon,April 2, 2018 01:46 PM

Arvind kejriwal says sorry to Finance Minister Arun Jaitly

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి కూడా ఆయన సారీ చెప్పారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. ఇప్పటికే మరో మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ అరుణ్ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పడంతో జైట్లీ కేసు వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గడ్కరీ కూడా తాను వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2015లో అరుణ్ జైట్లీ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్‌సింగ్, దీపక్ బాజ్‌పాయిలపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇప్పటికే విచారణ కొనసాగుతున్నది. వచ్చే విచారణలో కేజ్రీవాల్ క్షమాపణ చెప్పిన అంశం కోర్టు ముందుకు రానుంది. కేజ్రీవాల్ ఇలా వరుసగా అందరికీ క్షమాపణలు చెబుతూ వెళ్తుండటంపై ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఆయన క్షమాపణ పర్వం ఇక్కడితో ఆగేలా కూడా లేదు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిలకు కూడా ఆయన సారీ చెప్పే అవకాశాలు ఉన్నాయి.

1399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS