
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన మెడికల్ చెకప్ కోసం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి కేంద్ర బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టకపోవచ్చు అని ఊహాగానాలు వెలువెత్తాయి. ఈ క్రమంలో బడ్జెట్ ను ఎవరూ ప్రవేశపెడుతారనేది చర్చానీయాంశంగా మారింది. అయితే ఈ ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఫిబ్రవరి 1వ తేదీన అరుణ్ జైట్లీనే పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతారని తెలిపాయి. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ గతేడాది మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సాధారణ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. 2016 వరకు ఫిబ్రవరి నెలలో చివరి పనిదినం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఈ సంప్రదాయానికి అరుణ్ జైట్లీ తెరదించి.. 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.