
న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాలను ఆఫీసర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. 9096 మంది ఆఫీసర్లు తక్కువగా ఉన్నారని ఇవాళ లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ఆర్మీ వాటానే ఎక్కువగా ఉంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రె లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2018, జనవరి 1 వరకు పరిస్థితి చూస్తే ఆర్మీకి 49933 మంది ఆఫీసర్లకుగాను 42635 మందే ఉన్నారు. అంటే ఒక్క ఆర్మీలోనే 7298 మంది తక్కువగా ఉన్నారు. ఇక నేవీలో అధికారుల సంఖ్య 11352 ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 9746 మంది ఉన్నారు.
ఈ లెక్కన నేవీలో 1606 మంది అధికారుల కొరత ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో మాత్రం 192 మంది అధికారులు మాత్రమే తక్కువగా ఉన్నట్లు భామ్రె చెప్పారు. ఇక చైనా నుంచి సరిహద్దు రక్షణ సహకారానికి సంబంధించి ఏదైనా ఒప్పంద ప్రతిపాదన వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి లేదు అని సమాధానమిచ్చారు. 2013, అక్టోబర్ 23న రెండు దేశాల మధ్య ఒప్పందం ఉన్నదని, కొత్తగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు.