తప్పయింది.. క్షమించండి.. కొనసాగుతున్న కేజ్రీవాల్ సారీల పర్వం

Mon,March 19, 2018 05:15 PM

Aravind Kejriwal apologises union minister Nitin Gadkari

న్యూఢిల్లీః ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం కొనసాగుతున్నది. విక్రమ్ సింగ్ మజీతియా, కపిల్ సిబల్.. తాజాగా నితిన్ గడ్కరీ. ఇలా రోజుకొకరికి కేజ్రీవాల్ సారీ చెబుతున్నారు. తనపై ఉన్న పరువు నష్టం కేసుల నుంచి బయటపడుతున్నారు. కేజ్రీవాల్‌పై మొత్తం 33 పరువు నష్టం దావాలు ఉన్నాయి. ఇప్పుడు గడ్కరీకి ఓ లేఖలో కేజ్రీవాల్ సారీ చెప్పారు. నాకు వ్యక్తిగతంగా మీపై ఎలాంటి కక్ష లేదు. మీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. కోర్టు కేసును మూసేయిద్దాం అని గడ్కరీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. దీంతో కేజ్రీవాల్, గడ్కరీ ఇద్దరూ పరువునష్టం కేసును విత్ డ్రా చేసుకుంటామంటూ ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించారు. సరైన ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేసినందుకు కేజ్రీవాల్.. గడ్కరీకి క్షమాపణ చెప్పారు. ఇప్పటికే ఈ నెల 15న పంజాబ్ మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మతీజియాకు కూడా ఆయన ఇలాగే సారీ చెప్పారు. డ్రగ్ వ్యాపారంలో మజీతియా ఉన్నారంటూ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. అయితే తన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవంటూ ఆయనను క్షమించమని అడిగారు. దీంతో సొంత పార్టీ సభ్యులే కేజ్రీవాల్‌పై దుమ్మెత్తిపోశారు. పంజాబ్ పార్టీ చీఫ్ భగవత్ మన్ రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా కేజ్రీవాల్‌పై ఇప్పటికే పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

2856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS