కారు ఇస్తా..అమ్మతో యాత్ర కొనసాగించు

Wed,October 23, 2019 05:15 PM


అతని పేరు దక్షిణమూర్తి కృష్ణకుమార్. కర్ణాటకలోని మైసూరుకు చెందిన కృష్ణకుమార్ (39) ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎపుడూ ఏదో పనితో తీరికలేకుండా ఇంటికే పరిమితమైన కృష్ణకుమార్ తల్లి అతన్ని హంపీకి తీసుకెళ్లమని అడిగింది. ఎపుడూ ఏమి అడగని అమ్మ అడిగిన ఒక్క కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యాడు. కృష్ణకుమార్ తన 70 ఏళ్ల తల్లిని కేవలం హంపీకి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను తింపేందుకు సిద్దమయ్యాడు. తల్లితో కలిసి యాత్ర చేపట్టేందుకు తన బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 20 ఏళ్ల కిందటి బజాజ్ చేతక్ స్కూటర్‌పై తన తల్లిని ఎక్కించుకుని గత జనవరి నుంచి ఇప్పటివరకు 48100 కిలోమీటర్లు విజయవంతంగా చుట్టివచ్చాడు. కృష్ణకుమార్ తిరుగుతున్న స్కూటర్ అతడి తండ్రిది కావడం విశేషం.


కృష్ణకుమార్ యాత్రలో ఉండగా తీసిన వీడియోను నాంది ఫౌండేషన్ ఛైర్మన్, సీఈవో మనోజ్ కుమార్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఇది ఒక అందమైన కథ. ఓవైపు అమ్మ ప్రేమ, మరోవైపు దేశంపై ప్రేమ. మనోజ్ ఈ వీడియో షేర్ చేసినందుకు ధన్యావాదాలు. మీరు ఒకవేళ కృష్ణకుమార్‌కు నన్ను కలిసే అవకాశం ఇస్తే..నేను కృష్ణకుమార్ మహీంద్రా కేయూవీ 100 ఎఎక్స్‌టీ కారును అతనికి బహుమతిగా ఇస్తా. ఆ తర్వాత కృష్ణకుమార్ తన తల్లితో మిగతా ప్రయాణాన్ని మహీంద్రా కారులో పూర్తి చేయొచ్చని’ సూచించారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పలు ఆలయాలు, ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చూసినట్లు కృష్ణకుమార్ తెలిపాడు. యాత్ర జరుగుతున్న సమయంలో ఖర్చు విషయంలో పొదుపు మంత్రాన్ని ఫాలో అవుతున్నట్లు చెప్పాడు. ఆయా ప్రాంతాలకు వెళ్లినపుడు హోటల్ అద్దె, భోజన ఖర్చులు తగ్గించుకోవడానికి సత్రాలు, మఠాల్లో బస చేయడం, ఆహారం కూడా తినేవాళ్లమని కృష్ణకుమార్ తెలిపాడు. అమ్మపై ఉన్న ప్రేమతో ఆమె కోరికను మన్నించి దేశమంతా చుట్టివస్తున్న కృష్ణకుమార్ నెటిజన్లు సెట్యూట్ చేస్తున్నారు. వృద్దాప్య దశలో తల్లిదండ్రులను పట్టించుకోని ఎంతోమందికి కనువిప్పు కలిగేలా కృష్ణకుమార్ ఆలోచన అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.


7333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles