
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.80 దాటింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనూ ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ అంశంపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడారు. పెరుగుతున్న ఇంధన ధరల గురించి ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చిందన్నారు. రెండు అంశాలు ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. దీంతో అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా డాలర్ వల్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందన్నారు. డాలర్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మిగితా అనేక దేశాలతో పోలిస్తే భారత కరెన్సీ బలంగానే ఉందని, కానీ ఆయిల్‌ను మనం డాలర్ మారకం విలువతో కొనుగోలు చేస్తామని, అయితే ఆ డాలర్ మార్కెట్లో పెను సంక్షోభం సృష్టిస్తోందని మంత్రి ప్రదాన్ తెలిపారు. ఇంధన ధరలను స్థిరీకరించేందుకు ఒపెక్ హామీ ఇచ్చిందని, జూలై నుంచి రోజుకు ఉత్పత్తి చేయాల్సిన ఇంధనాన్ని పెంచుతామన్న ఆ సంస్థ విఫలమైందని, టార్గెట్‌ను చేరుకోలేకపోయామని మంత్రి తెలిపారు. ఇరాన్, వెనిజులా, టర్కీ దేశాలు ఇంధన ఉత్పత్తిపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. అయితే ఇలాంటి అంశాలను నియంత్రించే శక్తి భారత్‌కు లేదని ధర్మేంద్ర ప్రదాన్ చెప్పారు.