ప్రణబ్ ఇలా చేస్తారనుకోలేదు.. సోనియా సీరియస్!

Thu,June 7, 2018 04:20 PM

Ahmed Patel Tweets as Sonia Gandhi expresses anger over Pranab Mukherjee Attending RSS Meet

నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆహ్వానం మేరకు నాగ్‌పూర్ వెళ్లిన మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రణబ్ కూతురే ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రణబ్‌పై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సూచన మేరకు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఓ ట్వీట్ చేశారు.


ప్రణబ్.. మీ నుంచి నేను ఇది ఊహించలేదు అని అహ్మద్ పటేల్ ఆ ట్వీట్‌లో సోనియా భావాలనే వ్యక్తంచేశారు. ప్రణబ్ కూతురు, కాంగ్రెస్ నేత షర్మిష్ఠ ముఖర్జీ కూడా నిన్న ఓ ట్వీట్ చేస్తూ.. ఇది బీజేపీకి మేలు చేసే చర్యే అవుతుందని అన్నారు. ప్రణబ్‌ను ఈ ఈవెంట్‌కు వెళ్లకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ చాలానే ప్రయత్నించింది. సీనియర్ లీడర్ ఆనంద్ శర్మ ఆయనతో మాట్లాడి ఈవెంట్‌కు వెళ్లొద్దని వారించారు. అయినా ప్రణబ్ మాత్రం నాగ్‌పూర్ వెళ్లారు. జైరామ్ రమేష్ కూడా వెళ్లొద్దని కోరారు. మరో సీనియర్ చిదంబరం మాత్రం.. మీరు వాళ్ల ఆహ్వానాన్ని మన్నించారు.. అక్కడికి వెళ్లి వాళ్ల సిద్ధాంతంలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయో చెప్పండి అని ప్రణబ్‌ను కోరడం గమనార్హం.

అయితే బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మరో ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రణబ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలను ఆయన పట్టించుకోకుండా తాను కచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. తాను చెప్పాలనుకున్నది నాగ్‌పూర్‌లోనే చెబుతానని కూడా స్పష్టంచేశారు. దీంతో ఈ ఈవెంట్‌లో ఆయన ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గురువారం సాయంత్రం 6 గంటలకు ఆరెస్సెస్ కార్యక్రమం మొదలుకానుంది.

4070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS