చైనా లక్ష్యంగా త్వరలోనే ఆర్మీ చేతికి అగ్ని 5!

Sun,July 1, 2018 01:54 PM

Agni V will be soon inducted into Military say official sources

న్యూఢిల్లీ: చైనాలోని నగరాలను కూడా లక్ష్యంగా చేసుకోగల ఖండాంతర క్షిపణి వ్యవస్థ అగ్ని 5ను త్వరలోనే ఇండియన్ మిలిటరీ చేతికి అందనుంది. న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోగల ఈ క్షిపణి వ్యవస్థ.. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. దీనిని త్వరలోనే స్ట్రేటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) చేతికి అందజేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎస్‌ఎఫ్‌సీకి అందజేసే ముందు కొన్ని ట్రయల్స్ నిర్వహించినట్లు చెప్పాయి. చైనాలోని ప్రముఖ నగరాలైన బీజింగ్, షాంఘై, గువాంఘ్జౌ, హాంకాంగ్‌లు ఈ మిస్సైల్ పరిధిలోకి వస్తాయని రక్షణ శాఖ నిపుణులు తెలిపారు. గత నెలలోనే అగ్ని 5ని ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించి చూశారు. మరికొన్ని టెస్టులను కూడా రానున్న వారాల్లో పూర్తి చేయనున్నారు. ఈ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను మిలిటరీకి అందించే చివరి దశలో ఉన్నామని ఈ అగ్ని 5 ప్రాజెక్ట్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.

ఈ సిరీస్‌లో ఇదే అత్యాధునిక ఆయుధం. నావిగేషన్ కోసం లేటెస్ట్ టెక్నాలజీలను వాడటంతోపాటు న్యూక్లియర్ వార్‌హెడ్‌ను తీసుకెళ్లగల సామర్థ్యం కూడా చాలా ఎక్కువ. త్వరలోనే ఈ అగ్ని 5 తొలి బ్యాచ్‌ను ఎస్‌ఎఫ్‌సీకి అందజేయనున్నారు. ఇప్పటివరకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ దగ్గర 700 కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని 1, 2 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని 2, అగ్ని 3 (2500 కి.మీ.), అగ్ని 4( 3500 కి.మీ) ఉన్నాయి. 2012, ఏప్రిల్ 19న అగ్ని 5 తొలి పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 15, 2013లో రెండో టెస్ట్, జనవరి 31, 2015లో మూడో టెస్ట్, డిసెంబర్ 26, 2016లో నాలుగో టెస్ట్ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 18న ఐదో టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు.

2365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles