
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి డాలర్ల స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. దుబాయ్ వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన అతని దగ్గరి నుంచి రూ.3.59 కోట్ల విలువైన 4 లక్షల 90 వేల డాలర్లను డైరెక్టరేట్ ఆఫ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడు గతంలోనూ మిలియన్ డాలర్లకుపైగా ఇలాగే స్మగ్లింగ్ చేసినట్లు విచారణలో తేలింది. అతని వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. గత సోమవారం దుబాయ్ వెళ్లడానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆ వ్యక్తిని ముందస్తు సమాచారం మేరకు టెర్మినల్ 3లో పట్టుకున్నారు. అతడు ఈ డాలర్లను మైక్రోవేవ్ ఓవెన్, సెరామిక్ మగ్గుల్లో పెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించాడు. ఎవరూ పట్టుకోకుండా ఉండటానికి అతడు ఓవెన్‌ను పూర్తిగా పని చేయకుండా చేసి డబ్బును బ్లాక్ మాస్కింగ్ టేపుతో చుట్టాడు. గతంలో ఇండియాకు అక్రమంగా తీసుకొచ్చిన బంగారానికి సంబంధించి డబ్బు చెల్లించడానికి ఈ డాలర్లను దుబాయ్‌కు తీసుకెళ్లడానికి ఆ వ్యక్తి ప్రయత్నించాడు.