ఓటర్లూ జాగ్రత్త.. ఎన్నికల వేళ 87 వేల వాట్సాప్ గ్రూపుల వల!

Sun,March 24, 2019 02:00 PM

87000 Whatsapp Groups to target voters in this Elections season

న్యూఢిల్లీ: మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే ఈ పోలింగ్ ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ తొలి విడతలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే ఈసారి ఓటర్లకు గాలం వేయడానికి సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ను అత్యధికంగా వినియోగించనున్నట్లు తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. వీళ్లను ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి దేశవ్యాప్తంగా దాదాపు 87 వేల వాట్సాప్ గ్రూపులు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. అయితే దేశంలో ప్రస్తుతం 43 కోట్ల మంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, వీళ్లందరూ వాట్సాప్ వాడుతుండటంతో ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండే అవకాశం ఉన్నదని హాంకాంగ్‌కు చెందిన కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారం కోసం ఫేస్‌బుక్‌ను అత్యధికంగా వినియోగిస్తుండగా.. ఇప్పుడు దాని స్థానంలో వాట్సాప్‌ను వాడుతున్నట్లు ఈ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు.

జియో వచ్చిన తర్వాత డేటా కూడా చాలా చీప్‌గా లభిస్తుండటంతో రాజకీయా పార్టీలు తమ సభలు, సమావేశాలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను రీచ్ కావాలని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో అసత్య ప్రచారాలు కూడా ఊపందుకునే ప్రమాదం ఉన్నదని సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్ అనూప్ మిశ్రా అన్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూపులో అత్యధికంగా 256 మందిని చేర్చే వీలుంటుంది. ఈ లెక్కన మొత్తం 87 వేల గ్రూపులంటే.. నేరుగా 2.2 కోట్ల మందికి ఈ సందేశాలు వెళ్తాయి. ఆ సభ్యులు వేర్వేరు గ్రూపులకు ఇవే సందేశాలను ఫార్వర్డ్ చేస్తే.. మరెంత మందికి ఇవి వెళ్లే అవకాశం ఉందో ఊహించుకోవచ్చు. అయితే ఎన్నికల వేళ తమ ప్లాట్‌ఫామ్‌లో తప్పుడు ప్రచారం జరగకుండా చూసేందుకు వాట్సాప్ కూడా చర్యలు తీసుకుంటున్నది. ఎన్నికల సంఘం కూడా ఇలాంటి సోషల్ మీడియా సంస్థలపై నిఘా వేసి ఉంచింది.

3064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles