రెండు రైళ్లు కాళ్లను నుజ్జునుజ్జు చేసినా.. ఇండియాస్ గాట్ టాలెంట్‌లో స్థానం

Fri,December 14, 2018 07:50 PM

2 Trains Ran Over Him, Amputating His Legs now he Moonwalks on National TV

అతడి పేరు దేవ్ మిశ్రా, వయసు 22 ఏళ్లు. ఉండేది ముంబైలోని జూహులో. ఇండియాస్ గాట్ టాలెంట్ ఆడిషన్‌లో జడ్జిలనే మైమరిపించాడు. ఇందులో వింతేముంది అంటారా? అతడికి అందరిరా రెండు కాళ్లు లేవు. అతడి రెండు కాళ్లను రెండు రైళ్లు నుజ్జునుజ్జు చేశాయి. అతడి కాళ్ల మీది నుంచి రెండు రైళ్లు పోయాయి. దీంతో తొడల వరకు అతడి రెండు కాళ్లను తీసేశారు. ఇక.. దేనికీ పనికిరాననుకున్న దేవ్.. తన కష్టపడేతత్వంతో ఇండియాస్ గాట్ టాలెంట్‌లో స్థానం సంపాదించాడు. అందుకే ఇప్పుడు మనం అతడి గురించి మాట్లాడుకునేది.

దేవ్‌ది బీహార్‌లోని ధక్‌జారీ అనే గ్రామం. దేవ్ పుట్టిన ఆరునెలలకే అతడి తండ్రి మరణించాడు. దేవ్‌తో పాటు అతడి ఇద్దరు సోదరులను పెంచే బాధ్యత దేవ్ తల్లిపై పడింది. దేవ్ కూడా తన 5 ఏళ్ల వయసు నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఎనిమిదో తరగతిలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో స్కూల్ మానేసి పనిలోకెక్కాడు. అలా తన తల్లి, ఇద్దరు సోదరుల కోసం ఏ పని దొరికితే ఆ పని చేయడం మొదలు పెట్టాడు దేవ్.

ఆ తర్వాత హైదరాబాద్‌లో తెలిసిన వాళ్ల దగ్గర పని ఉందంటే.. బ్యాగు సర్దుకొని బయలుదేరాడు. కానీ.. ఆ ప్రయాణమే దేవ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని మాత్రం తెలుసుకోలేకపోయాడు. హైదరాబాద్ వెళ్లడం కోసం బీహార్‌లోని బరౌనీ స్టేషన్‌కు వచ్చాడు. ట్రెయిన్ వస్తోంది. ట్రెయిన్ సమీపిస్తుండగా ప్లాట్‌పాం ముందు నిలబడ్డాడు. అంతే.. వెనుక నుంచి ఎవరో దేవ్‌ను తోసేశారు. అప్పటికే ట్రెయిన్ ప్లాట్‌ఫాం మీద వస్తోంది. వెంటనే అతడి కాళ్ల మీది నుంచి ఆ ట్రెయిన్ వెళ్లిపోయింది. దీంతో దేవ్ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దేవ్‌ను చూసిన ప్రయాణికులు అయ్యో.. అయ్యో అన్నారు తప్పితే.. అతడిని ట్రాక్ నుంచి మాత్రం పైకి తీసుకురాలేదు. దీంతో దేవ్ కాళ్ల పైనుంచి మరో ట్రెయిన్ కూడా పోయింది. ఆ తర్వాత కొంతమంది ప్రయాణికులు అతడిని లేపి ప్లాట్‌ఫాం పైన పడుకోబెట్టి వెళ్లిపోయారు. మూడుగంటల వరకూ ఒక్కరూ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దేవ్ ఫ్రెండ్ వచ్చి అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దేవ్ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. కానీ.. దేవ్‌లో ఉన్న కసి దేవ్‌ను బతికేలా చేసింది. దేవ్ ఆసుపత్రి ఖర్చుల కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేశారు. లక్షలు అప్పు చేసి చికిత్స తీసుకున్నాడు. మూడు నుంచి నాలుగు నెలల దాకా దేవ్ మంచం నుంచి లేవలేకపోయాడు. దేవ్ తల్లి అతడిని కంటికి రెప్పలా చూసుకున్నది.

దేవ్ రెండు కాళ్లను డాక్టర్లు తీసేయడం వల్ల దేవ్ నడవలేడు.. ఏ పనీ చేయలేడని తెలుసుకున్న అతడి సోదరుడు.. దేవ్ ఇక దేనికీ పనికి రాడని నిందించాడు. ఇన్ని రోజులు దేవ్ పనిచేసి వాళ్లను పోషిస్తే.. ఇప్పుడు అతడి సోదరుడు.. దేవ్ తనకు ఎక్కడ భారం అవుతాడో అని దేవ్‌ను నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. బీహార్‌ను వదిలేసి ముంబైకి వచ్చేశాడు. కుర్లా స్టేషన్‌లో చాలారోజులు గడిపాడు. అడుక్కుతిని బతికాడు. తిని వదిలేసిన ఆహారం తిని కొన్ని రోజులు బతికాడు. సినిమా సెలబ్రిటీలు ఉండే బాంద్రా, జూహు ఏరియాలో తిరిగేవాడు. ఎవరన్నా సహాయం చేయరా అని ఎదురు చూసేవాడు. ముంబై వచ్చిన ఓ నెల రోజుల తర్వాత అతడి జీవితం మారిపోయింది.

అతడికి జ్యూయలరీ డిజైనర్ ఫరాహ్ ఖాన్ అలీ అనే యువతి పరిచయం అయింది. అతడిని రోడ్డు మీద చూసిన ఫరాహ్ ఖాన్ అతడిని దగ్గరికి తీసుకుంది. అతడి యాక్సిడెంట్ గురించి తెలుసుకుంది. దీంతో అతడికి వెంటనే ఓ ట్రైసైకిల్ కొనిచ్చి.. ఓ పదివేలు ఇచ్చి.. ఉండటానికి రూమ్ ఇచ్చింది. ఇప్పటికీ ఆమే దేవ్‌కు అన్నిరకాలుగా సాయపడుతోంది. ఐదు లక్షలు ఖర్చు పెట్టి ప్రోస్తేటిక్స్ కాళ్లు కూడా పెట్టించింది.

దేవ్ కోసం ఏం చేయడానికైనా ఆమె సిద్ధపడటంతో.. దేవ్ కూడా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ప్రాక్టిస్ స్టార్ట్ చేశాడు. రోజూ జూహూలోని కార్టర్ రోడ్‌లో వ్యాయామం చేసేవాడు. ఓరోజు విశాల్ పాశ్వాన్ అనే డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ దేవ్ వ్యాయామం చేస్తుండగా చూసి ఓ స్టెప్ వేయమని చెప్పాడు. దేవ్ కాళ్లు లేకున్నా సూపర్బ్‌గా స్టెప్స్ వేశాడు. విశాల్ స్టెప్పులను ఒకసారి చూసి వెంటనే అనుకరించేవాడు. దీంతో విశాల్ అధ్వర్యంలో ఎన్నో డ్యాన్స్ షోలలో పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కింది దేవ్‌కు. విశాల్ కూడా ఎప్పటికప్పుడు దేవ్‌కు డ్యాన్స్ స్టెప్స్ నేర్పిస్తుండేవాడు. ఆతర్వాత పాపులర్ టాలెంట్ షో.. ఇండియాస్ గాట్ టాలెంట్‌లో దేవ్‌కు చోటు దక్కింది. ఇప్పుడు దేవ్ సెలబ్రిటీ అయిపోయాడు. ఎక్కడి బీహార్.. ఎక్కడి ముంబై.. ఎక్కడి ఇండియాస్ గాట్ టాలెంట్. అన్నీ సక్రమంగా ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో ఉంటారు చాలామంది. కానీ.. రెండు కాళ్లు లేకున్నా ఏదో చేయాలన్న తపనతో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని.. కష్టాలకు ఎదురీది మరీ.. విజయతీరాలకు చేరుకున్నాడు దేవ్.

నేను ఇప్పుడు చదువుకుంటున్నాను.. డ్యాన్స్ చేస్తా. వంట చేస్తా.. తింటా.. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఎక్కువగా చదువుకోనప్పటికీ.. మా అమ్మను సంతోషంగా చూసుకోవాలనుకోవడమే నా లక్ష్యం.. అంటున్నాడు దేవ్. ఫైనల్‌గా దేవ్ ఫిట్‌నెస్ వీడియో ఓసారి చూసేయండి.

6412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles