నారాయణపేట రూరల్, జూన్ 24 : మండలంలోని జాజాపూర్, సింగారం, అప్పక్‌పల్లి, ఊటకుంటతండా, వందర్గుట్ట తండా, కొల్లంపల్లి, శాసన్‌పల్లి, పేరపళ్ల, కిందితండా తదితర గ్రామాల్లో గురువారం ఏరువాక పౌర్ణమిని రైతులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పోలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రైతులు ఎద్దులను వివిధ రంగులతో అందంగా ముస్తాబు చేశారు. పలు గ్రామాల్లో సాయంత్రం ఎద్దులను గ్రామ పురవీధుల్లో ఉరేగింపు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో ఎద్దుల పరుగు పందెం పోటీలు నిర్వహించారు.
ఊట్కూరు మండలంలో..
ఊట్కూర్, జూన్ 24 : ఏరువాక పండుగను గురువారం మండలంతోపాటు పరిసర గ్రామాల్లో రైతులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఈ పండుగను ప్రధానంగా రైతుల పండుగగా చెప్పవచ్చు. ఏరువాక పండుగలో భాగంగా గ్రామీణ ప్రాంత రైతులు పశువులను శుభ్రపరిచి శరీరంపై రంగులు అద్ది అందంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా వ్యవసాయం పనుల్లో పాల్గొనే ఎద్దులు ఏడాదంతా బలంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాకను నిర్వహిస్తారు. ఎదులను అందంగా అలంకరించి సాయంత్రం గ్రామ పురవీధుల చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. మహిళలు పిండి వంటల నైవేద్యంతో గ్రామ దేవత పోలేరమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మండలంలో దంతన్‌పల్లి, ఊట్కూరు శివారు రైతులు వేర్వేరుగా వీధుల చుట్టూ ఎద్దులతో ఊరేగింపు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆలయాల దగ్గర ఏరువాక తాడును తెంచేందుకు రైతులు పోటీ పడ్డారు.
మక్తల్‌లో..
మక్తల్ టౌన్, జూన్ 24 : ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు ఎద్దులను రంగు రంగులతో అలకరించి ఆనందపడుతూ పండుగను నిర్వహించారు. పట్టణంలో ఏరువాక పండుగ సందర్భంగా మహిళలు మారెమ్మ, పోలమ్మ దేవతలకు బోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కోస్గి మండలంలో..
కోస్గి, జూన్ 24 : రైతన్న దుక్కిదున్నడానికి సన్నద్ధమై పంటలు పండించుకునేందుకు గుంటుక పూజ చేస్తూ పొలం పనిలో నిమగ్నమయ్యే పండుగ ఏరువాక. ఏరువాక పండుగను మండలంలో ఘనంగా నిర్వహించారు. రైతులు ఉదయాన్నే పశువులకు స్నానం చేయించి పసుపు, బెల్లం తినిపించారు. అనంతరం గుంటుకకు, ఎద్దులకు పూజ చేసి నైవేద్యం పెట్టి అందంగా అలంకరించారు. నేటి నుంచి రైతన్న తన పొలం పనుల్లో నిమగ్నం కానున్నాడు. అదే క్రమంలో పోలేపల్లిలో ఎద్దులను ఊరేగించారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, జూన్ 24 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఏరువాకను రైతులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. గతేడాది కంటే ఈసారి ఏరువాక ఇంకా ఉత్సాహంగా ప్రజలు చేపట్టారు. ఈసారి సరైన సమయానికి వర్షం కురువడం ఇప్పటికే రైతులు పునాసల పనులు అయిపోవడంతోపాటు రైతుబంధు పెట్టుబడి సహాయం అందడంతో కేరింతలతో ఎద్దులను అందంగా ముస్తాబు చేసి ఊరేగించారు. కార్యక్రమంలో రైతులు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, జూన్ 24 : మండలంతోపాటుగా గ్రామాల్లో గురువారం ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలో మహిళలు పోలమ్మ దేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ అమరేందర్‌రెడ్డి సారథ్యంలో ఏరువాక తాడును ఊరేగించి లక్ష్మీవాడలో తెంచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోవర్ధన్‌గౌడ్, ఉపసర్పంచ్ యూసుబ్ అలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో ..
నర్వ, జూన్ 24 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఏరువాక పండుగను రైతులు, ప్రజలు ఘనంగా నిర్వ హించారు. వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహించి, పశువులను రంగు రంగులతో అలంకరించి ఆయా గ్రామా ల్లో ఏర్పాటు చేసిన ఏరువాక తాడును తేంపేందుకు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా గ్రామాల ఆలయల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు మంచిగా పండేలా చూడాలన్నారు.