మోర్తాడ్, జూలై 12:ఆ గ్రామానికి వెళ్తే వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తాయి. ఎక్కడ కూడా మురికి నీరు, మురికి ఏర్పడిన ప్రాంతాలు దర్శనమివ్వవు. రోడ్లకిరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు, ఇండ్లలో పూలమొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి. పంచాయతీ భవనాన్ని చూస్తేనే అర్థమవుతుంది.. ఈ గ్రామంలో హరితహారం విజయవంతంగా కొనసాగుతున్నదని.. వీటికి తోడు పన్నుల వసూళ్లలో ముందుండి గత సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీగా పురస్కారం అందుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలతో సమస్యలన్నింటికీ దూరమై స్వచ్ఛగ్రామంగా నిలిచింది మోర్తాడ్ మండలం గాండ్లపేట్.
గాండ్లపేట్ గ్రామపంచాయతీ భవనం చూస్తే పూర్తిగా పచ్చదనంతో కనిపిస్తుంది. ఇందుకు కారణం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏటా జీపీ ఆవరణలో, బయట మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే. పచ్చనిచెట్లతో గ్రామపంచాయతీ భవన వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది. పంచాయతీ భవనం ప్రహరీ పక్కన పూలమొక్కలను పెంచడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.
ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు
పల్లెప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ రావడంతో ఎంతో ఉపయుక్తంగా మారింది. ప్రతి రోజూ పారిశుద్ధ్యకార్యక్రమాలను చేపడుతున్నారు. మురికి కాలువలను శుభ్రం చేస్తూ చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఇంటింటి చెత్త సేకరణకు ట్రాక్టర్ వెళ్తుండడంతో ఇంటి పరిసరాల్లో కూడా చెత్త అనేది కనిపించకుండా పోయింది. దీంతో గ్రామం శుభ్రంగా మారిపోయింది. ఏ వీధి తిరిగినా పరిశుభ్రతే కనిపిస్తుంది.
సమయానికి పల్లెప్రగతి పనులు
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు నిర్మాణం పనులు సకాలంలో పూర్తయ్యాయి. పెద్దవాగు పక్కన పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేయడం, పక్కనే హనుమాన్, శివాలయాలు ఉండడంతో వాగులో నీళ్లు పారుతున్నపుడు పిక్నిక్ స్పాట్‌గా మారనుంది.
విజయవంతంగా హరితహారం
హరితహారం కార్యక్రమం గ్రామంలో విజయవంతంగా సాగుతున్నది. ప్రతి సంవత్సరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ నుంచి ప్రతి ఇంటికీ కావాల్సిన మొక్కలను అందజేస్తున్నారు. రోడ్లకిరువైపులా నాటిన మొక్కలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సంరక్షిస్తున్నారు. పన్నుల వసూళ్లు, పల్లెప్రగతి కార్యక్రమాలతో గత సంవత్సరం ఉత్తమ గ్రామపంచాయతీగా గాండ్లపేట్ ఎంపికైంది.
ప్రజల సహకారంతోనే…
గ్రామప్రజల సహకారంతోనే గ్రా మాన్ని శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్, ట్యాంకర్‌ను ఇప్పించడంతో పల్లెప్రగతి పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతున్నాం.
-మామిడి సౌజన్య, సర్పంచ్ గాండ్లపేట్