శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 17, 2021 , 00:29:30

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషక తోటలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషక తోటలు

  • కలెక్టర్‌ హరిచందన 

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 16: జిల్లాలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పోషక తోటలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. మంగళవారం పట్టణంలోని కలెక్టర్‌లో బీఏఎస్‌ఎఫ్‌ సీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో పోషక తోటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషక తోటలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీడ్‌లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ తోటల వల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించవచ్చని, చిన్నారుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. పోషక తోటల పెంపకంలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములు చేశామన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా మహిళలు కూరగాయలు తోటలు సాగు చేయాలన్నారు. కేంద్రాల్లో స్థలం లేని వారు టెర్రస్‌పై గార్డెన్లను ఏర్పాటు చేసి కేంద్రం చుట్టూ తీగలను వదలవచ్చన్నారు. మహిళలు ఇంటి పై భాగంలో పెంచుకోవచ్చన్నారు. కొవిడ్‌ వల్ల అందరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారని, కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. పోషక తోటలను మం చిగా పెంచిన అంగన్‌వాడీ కేంద్రాలకు అవార్డులు అందజేస్తామన్నారు. ప్రతి నెలా న్యూట్రీషన్‌పై సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం పోషక తోట కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో గ్లోబల్‌ సంస్థ ప్రొడక్షన్‌ అధికారి శాల్వరాజు, డీఆర్డీవో కాళిందిని, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జాన్‌సుధాకర్‌, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి జైపాల్‌రెడ్డి, గ్లోబల్‌ సంస్థ ప్రతినిధులు మంజునాథ్‌నాయక్‌, విక్రంజైన్‌, రమేశ్‌, సీడీపీవోలు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo