బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 09, 2021 , 00:19:13

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

  • కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 
  • ఎమ్మెల్యే  రాజేందర్‌రెడ్డి

నారాయణపేట, జనవరి 8: ప్రజల గొంతుకయని చెబుతూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రజా సమస్యలను పరిష్కరించలేదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్స్‌లో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న డీకే అరుణ నారాయణపేట నియోజకవర్గానికి చేసింది ఏమిటో చెప్పాలన్నారు. ప్రతి పక్షాలు ప్రశ్నించే పాత్రకే పరిమితమని, ప్రజల సమస్యలను పరిష్కరించడం మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. గతంలో రూ. 200ల పెన్షన్‌ అందిస్తుండగా మీ అందరి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్‌ నేడు రూ.2వేల పెన్షన్‌ అందిస్తున్నారన్నారు. బీజేపీ పాలిస్తున్న 12 రాష్ర్టాల్లో రూ.2వేల పెన్షన్‌ అందిస్తున్నారా, రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ అందిస్తున్నారా, రైతు బంధు, రైతు బీమా, బాలింతలకు కిట్‌లను అందిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయపై ప్రజలు చర్చించుకోవాలన్నారు. కరోనా పరిస్థితుల్లో కూడా రైతులందరికీ పెట్టుబడులుగా వారి అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు. నారాయణపేటలో ప్రతి  సందులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. గతంలో పన్నెండు రోజులకోసారి నీళ్లు వచ్చేవని, నేడు రోజు విడిచి రోజు నీళ్లు అందుతున్నాయన్నారు. రానున్న ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ.8కోట్ల డ్రైనేజీ నిర్మాణ పనులకు త్వరలోనే శ్రీకారం చుడతామని, తానే వచ్చి పనులను ప్రారంభిస్తానని  గురువారం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తనకు హామీ ఇచ్చారన్నారు. నారాయణపేటను జిల్లాగా మార్చిన ఘనత, పేటలో ప్రధాన రోడ్డు వెడల్పు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు.  మంత్రిగా ఉండి కూడా తన తండ్రి స్థాపించిన కళాశాలను ప్రభుత్వ పరం చేయడానికి మాజీ మంత్రి డీకే అరుణ చేతకాలేదని, తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేశామన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా పాలన చేస్తున్నానని, తనపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలను పలికినట్లు ఉందన్నారు. నారాయణపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. త్వరలో సీఎంను నారాయణపేటకు ఆహ్వానించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేస్తామన్నారు. జిల్లా ఏర్పాటుతో నారాయణపేటలోని భూముల విలువ  పెరిగిందని, దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నారని, ఒక్కొక్కరి ఫైల్‌ బయటకు తీయించి ప్రజల ముందు పెడతానన్నారు. 177 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో తాసిల్దార్‌ దానయ్య, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భాస్కరకుమారివెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు తాజుద్దీన్‌,  వైస్‌ ఎంపీపీ సుగుణ, కౌన్సిలర్లు శిరీషచెన్నారెడ్డి, బండి రాజేశ్వరి, మహేశ్‌, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గట్టు రాఘవరెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo