బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Dec 25, 2020 , 01:12:21

పకడ్బందీగా నిర్వహించాలి

పకడ్బందీగా నిర్వహించాలి

  • కొవిడ్‌ టీకా, పల్స్‌ పోలియోకు  ముమ్మరంగా ఏర్పాటు
  • ప్రతి టీకా కేంద్రంలో 3 గదులు
  • కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌ సరఫరా
  • ఎవరూ భయపడాల్సిన పని లేదు
  • అందరికీ వేసేలా ప్రణాళిక సిద్ధం
  • వచ్చే నెలలో 17 నుంచి పల్స్‌ పోలియో
  • కలెక్టర్‌ హరిచందన 

నారాయణపేట టౌన్‌ : 2021 జనవరిలో ఇవ్వనున్న కొవిడ్‌ టీకా, పల్స్‌ పోలియో కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో కొవిడ్‌, పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరిలో కొవిడ్‌ టీకా రాబోతుందని, ఈ టీకాను ముందుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేస్తున్న హెల్త్‌ సిబ్బంది, పోలీస్‌, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో 2,430 మందితో జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. వ్యాక్సిన్‌ను ఎన్నికల నిర్వహణ మాదిరిగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి టీకా కేంద్రంలో 3 గదులు ఉండేలా చూడాలని, మొదటి గదిలో రిజిస్ట్రేషన్‌ పరిశీలన, రెండో గదిలో టీకా ఇవ్వడం, మూడో గదిలో 30 నిమిషాలపాటు పర్యవేక్షణ ఉంటుందన్నారు. జిల్లాలో వ్యాక్సిన్‌ వేసే కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా అధికారులు చూడాలన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడంపై సిబ్బందికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, టీకా ఎంతో సురక్షితంగా తయారు చేశారన్నారు. టీకా విషయంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. రెండో దఫాలో అనారోగ్యంతో ఉన్న వృద్ధులను గుర్తించి రిజిస్ట్రేషన్‌ చేసిన అనంతరం, మూడో దఫాలో మిగతావారందరికీ టీకా ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జనవరి 17 నుంచి 3 రోజులపాటు పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు తెలిపారు. జిల్లాలో 1 నుంచి 5 ఏండ్లలోపు చిన్నారులు 64,170 మంది ఉన్నారని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఐవో శైలజ వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమ నమూనాను ప్రొజెక్టర్‌ ద్వారా అధికారులకు వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సిద్రామప్ప, జిల్లా శిశు సంక్షేమ అధికారి జైపాల్‌రెడ్డి, అదనపు డీఆర్డీవో సత్యనారాయణ పాల్గొన్నారు. 

కేంద్రాలను ఏర్పాటు చేయాలి

జిల్లాలో కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి విక్రయాలు ప్రారంభించాలని కలెక్టర్‌ హరిచందన అధికారులకు సూచించారు. పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కంది పండించిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజర్‌ ఉంచాలని, రైతులు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమికంగా 10 కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో తూకపు మిషన్లు ఇతర వసతులు ఉంచుకోవాలని మార్క్‌ఫెడ్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo