నివారణ ఒక్కటే మార్గం

- అవగాహన,మంచి ప్రవర్తనతో హెచ్ఐవీ దూరం
- నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం
నారాయణపేట టౌన్ : హెచ్ఐవీకి చికిత్స లేదు..నివా రణ ఒక్కటే మార్గం. అప్రమత్తంగా ఉండడం వల్ల వ్యాధిని నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. హెచ్ఐవీపై అవగాహన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వ్యాధిపై అవగాహన పెంచుతూ సురక్షితం కాని లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్షత చూపరాదని చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు..
వ్యాధిగ్రస్తులకు నాలుగు దశల్లో లక్షణాలు కనిపిస్తాయి. మొదటి దశలో ఫ్లూ జ్వరం, రక్తంలో వైరస్ సంఖ్య అధికంగా ఉన్నట్లయితే ప్రతిరక్షకాలు కనిపించవు. టీబీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. రెండో దశలో హెచ్ఐవీ ఉనికి తెలుస్తున్నది. మూ డో దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గుతున్నది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. నాల్గో దశలో దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరేచనాలు, నోటిలో పుళ్లు ఏర్పడడం, లింఫు గ్రంథులు వాయడం, శరీరం బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు...
హెచ్ఐవీ సోకిన వారు జీవితకాలం పాటు మందులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. సురక్షితం కాని లైంగిక చర్యల్లో పాల్గొనరాదు. రక్త మార్పిడి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆమోదిత రక్తనిధి కేంద్రం నుంచి పొందిన రక్తాన్ని మాత్రమే ఉపయోగించాలి. 2018లో నారాయణపేట జిల్లాలో 5,451 మంది గర్భిణులకు పరీక్షలు చేయ గా అందులో 11 మందికి వ్యాధి నిర్ధ్దారణ అయింది. 2019లో 6,658 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా 10 మందికి, 2020 నవంబర్ వరకు 3,694 మంది గర్భిణులకు పరీక్షలు చేయగా ఏడుగురికి వ్యాధి నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది వ్యాధి బారిన పడిన వారిని పరిశీలిస్తే జిల్లాలో నారాయణపేట మండలం మొదటి స్థానంలో ఉండగా, ఊట్కూర్, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. సలహాలు, సూచనలు కావలసిన వారు వీసీటీసీ ఇన్చార్జి సుధాకర్ ఫోన్ 9885660399 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.
జిల్లాలో మూడేండ్లలో చేసిన పరీక్షల వివరాలు
ఏడాది పరీక్షలు పాజిటివ్
2018 8033 144
2019 8998 104
2020 4773 83