శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 21, 2020 , 03:13:24

తాత అంత్యక్రియలకొచ్చి ప్రాణం విడిచి..

తాత అంత్యక్రియలకొచ్చి ప్రాణం విడిచి..

  • చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి
  • ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో మిన్నంటిన రోదనలు
  • నంద్యానాయక్‌ తండాలో 
  • నారాయణపేట జిల్లాలో ఘటన
మహబూబ్‌నగర్‌ ప్రతినిధి నమస్తే తెలంగాణ/దామరగిద్ద : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్‌మడక  గ్రామ పంచాయతీ పరిధిలోని నంద్యా నాయక్‌తండాలో విషాదం చోటు చేసుకుంది. తాత అంత్యక్రియలకు వచ్చి నలుగురు మనుమండ్లు చెరువులో మునిగి మృత్యువాత పడిన ఘటనతో తండాలో తీవ్ర విషాదం అలుముకుంది. శుక్రవారం సాయంత్రం చెరువులో స్నానం చేయడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నంద్యానాయక్‌ తండాకు చెందిన రాములునాయ క్‌ (65) గురువారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. అంత్యక్రియలు శుక్రవారం నంద్యానాయక్‌ తండాలో జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన అనంతరం మనువళ్లు అయిన ఐదుగురు చిన్నారులు స్నానం చేయడానికి చెరువు వద్దకు వెళ్లారు. ముందుగా చెరువులోకి దిగిన నలుగురు చిన్నారులు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత మరొకరు మునిగిపోయారు. వీరితో పాటు వెళ్లిన విశాల్‌ నాయక్‌(13) సైతం చెరువులో మునిగి..కష్టంగా బయటికి వచ్చాడు. చిన్నారులు చెరువు వద్దకుకు వెళ్లిన విషయాన్ని గమనించిన వృద్ధురాలు తండావాసులకు సమాచారం అందించింది. వెంటనే చెరువు వద్దకు చేరుకుని స్థానికులు గాలింపు చేపట్టగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు గుర్తించారు. మృతులను అర్జున్‌నాయక్‌(13), అరుణ్‌నాయక్‌ (11), గణేశ్‌నాయక్‌ (12), ప్రవీణ్‌నాయక్‌ (12)గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన విశాల్‌ను దవాఖానకు తరలించి చికిత్స అందించారు. స మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. లక్ష్మణ్‌నాయక్‌ అనే వ్యక్తి కుమారులు అర్జున్‌, అరుణ్‌ ప్రమాదంలో మృతి చెందారు. మోహన్‌నాయుడు కుమారుడు గణేష్‌, అనురాధ కుమారుడు ప్రవీణ్‌ అకాల మరణంతో తల్లిదండ్రుల రోదన స్థానికులను కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు తాత అంత్యక్రియలకు వచ్చి మృత్యువాత పడిన ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు రోదన అందరినీ కంటతడి పెట్టించింది. హైదరాబాద్‌లోఉండే చిన్నారులకు ఈత రాకపోవడం, చెరువు లోతుపై అవగాహన ఉండకపోవడం వల్ల నీట మునిగి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు.

VIDEOS

logo