గురువారం 03 డిసెంబర్ 2020
Narayanpet - Oct 22, 2020 , 02:27:16

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

  • ఎస్పీ డాక్టర్‌ చేతన

నారాయణపేట: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ డా.చేతన అన్నారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పరేడ్‌ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అమరవీరులు ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉంటారన్నారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచే పోలీస్‌ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.  2005లో నక్సల్స్‌ కాల్పుల్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్‌ రాజిరెడ్డి భార్య భాగ్యమ్మను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఆర్ముడ్‌ రిజర్వ్‌) భరత్‌, డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్‌, రామ్‌లాల్‌, ఆర్‌ఐ కృష్ణయ్య, ఎస్‌ఐ చంద్రమోహన్‌రావు పాల్గొన్నారు. 

మక్తల్‌లో..

  మక్తల్‌ టౌన్‌: సమాజ క్షేమం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా సమర్పించుకున్న త్యాగమూర్తులకు  శతకోటి నీరాజనాలు అని మక్తల్‌ ఎస్సై రాములు అన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సురక్ష ఫౌండేషన్‌ సమక్షంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులు  మాట్లాడు తూ  సమాజంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, శాంతి భద్రతల విషయంలో విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కర్తవ్యాన్ని నిర్వ హిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎస్సై రాములు మాట్లాడుతూ శాంతి బధ్రతల పరిరక్షణకు ప్రజలు ముఖ్యంగా యువత పోలీసులకు సహాయ సహకారాలు అందించాలన్నారు.  సురక్ష ఫౌండేషన్‌ స భ్యులు ఎస్సై రాములు , పోలీసులను సన్మానించారు. కార్యక్రమం లో రిటైర్డ్‌  పీఈటీ గోపాలం, ఆర్మీ ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, శివరాజ్‌, అంబాదాస్‌, సయ్యద్‌, ప్రవీణ్‌, శర్మ పాల్గొన్నారు.

నర్వలో..

నర్వ:  సమాజ సేవ కోసం తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని బుధవారం నర్వ ఎస్సై నవీద్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ఏఎస్సై రాజేశ్‌, కానిస్టేబుల్‌ రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్‌తోపాటు పట్టణానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. 

ఊట్కూర్‌లో..

ఊట్కూర్‌ : ప్రభుత్వ ఆస్తులు, ప్రజల మాన ప్రాణాలు కాపాడుతూ సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసుల త్యాగాలు వెలకట్ట లేనివని సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. జాతీయ అమరపోలీసు దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో అమరుల చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసులు, గ్రామ ప్రజలు అమరులకు జేజేలు పలుకుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అమర పోలీసుల ఆత్మశాంతి కోరుతూ స్థానిక అంబేద్కర్‌ కూడలిలో శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, కానిస్టేబుళ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.