శనివారం 06 జూన్ 2020
Narayanpet - Mar 10, 2020 , 00:05:16

ఆనందం.. ఆహ్లాదం

ఆనందం.. ఆహ్లాదం

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వనపర్తి పట్టణం 1984లో గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా ఏర్పాటైంది. అనంతరం 2000 సంవత్సరంలో నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. ప్రస్తుతం  మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. దాదాపు 46 ఏళ్ల కిందట నగర పంచాయతీగా ఏర్పాటైన వనపర్తి పట్టణంలోని వివిధ కాలనీల్లో 32 పార్కు స్థలాలున్నాయి. కాని వీటిని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం గతంలో ఎంత మాత్రం జరగలేదు. కేవలం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ముందున్న ఇందిరా పార్క్‌ పట్టణ ప్రజల ఆహ్లాదానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. పట్టణంలో జనాభా అవసరాలకు తగ్గట్టు పార్కులను అభివృద్ధి చేయకపోవడంతో ఇంతకాలం ప్రజలు ఆహ్లాదానికి దూరమయ్యారు. ఇక గడిచిన నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇక్కడి పార్కులను అభివృద్ధి చేయడంతో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి.

రూ.2 కోట్ల నిధులతో..

 పట్టణంలోని 11 పార్కు స్థలాలను అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌  ద్వారా రూ.2కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా  పట్టణంలోని 29వ వార్డులోని నూటౌన్‌ కాలనీలో రెండు పార్కులు, 30వ వార్డులోని నందిహిల్స్‌ కాలనీలో ఒక పార్కు, 32వ వార్డులోని కేడీఆర్‌ నగర్‌లో మూడు పార్కులు, 31వ వార్డులో ఒక పార్కు, బండార్‌ నగర్‌ ఈసేవ కేంద్రం సమీపంలో పార్కులను అభివృద్ధి చేశారు. ఇంకా మరో మూడు పార్కుల్లో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది పార్కులు ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఉపశమనం పొందుతున్నారు. ఈ పార్కులకు ప్రహరీల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌, చిన్నారులకు ఆట.. పాటలు ఉండే సామగ్రి ఏర్పాటు, ఓపెన్‌ జిమ్‌, పచ్చదనంతో ల్యాన్‌, మొక్కల పెంపకం చేపట్టారు. కాలనీలను అనుసరించి పచ్చదనంతో కూడిన పార్కులు ఏర్పాటు కావడంతో జనం రద్దీగా తరలి వస్తున్నారు. ఈ పార్కుల్లో కొన్నిటిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డిలు ప్రారంభిస్తే.. మరో రెండు పార్కులను ఇటీవల శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి సింగిరెడ్డిలు ప్రారంభించారు. 

ఎకో పార్కుతో మారిన స్వరూపం

వనపర్తి పట్టణాన్ని అనుసరించి పెబ్బేరు రోడ్డులో  ఏర్పాటు చేసిన ఎకో పార్కు నిర్మాణం ద్వారా పట్టణ స్వరూపంలో మార్పు వచ్చింది. ఆహ్లాదకర వాతావారణంలో.. పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఎకో పార్కును చూసిన వారెవరైనా ముచ్చటగొలుపుతుంది. దాదాపు రూ.కోటి నిధులతో పార్కును ఏర్పాటు చేసిన ఘణత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కింది. దీంతో పాటు పట్టణంలోని కేడీఆర్‌ నగర్‌లో స్మృతివనం ఏర్పాటు చేసి మరో ప్రత్యేకతను చాటుకున్నారు. ఎప్పుడు సెలవొచ్చినా.. పండుగలు.. ఇతర పర్వదినాలొచ్చినప్పుడల్లా నేడు చిన్నారులతో, పట్టణవాసులతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి భారీగా పార్కుకు జనం తరలి వస్తున్నారు. 

మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో..

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చొరవతోనే పట్టణంలోని పార్కులు పచ్చదనంతో నిండుకుంటున్నాయి. ప్రధానంగా ఎకో పార్కును సాధించడంలో మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో కేవలం మహబూబ్‌నగర్‌ తర్వాత వనపర్తికి మాత్రమే ఎకో పార్క్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎం కేసీఆర్‌ సహకారంతోనే ఎకో పార్కును మంత్రి సాధించారు. అయితే, పాత జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఏకోపార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం కొత్త జిల్లా కేంద్రాల్లో ఒక్క వనపర్తికి మాత్రమే నిరంజన్‌ రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ ఫలితంగా ఏకోపార్కు మంజూరైంది.ఇక పట్టణంలో ఉన్న పార్కులకు సహితం నిధులను మంజూరు చేయించడం...పనులను సహితం పూర్తి చేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంతో నేడు కాలనీల్లోని ప్రజలు పార్కుల ద్వారా ఆహ్లాదాన్ని...ఆనందాన్ని పొందుతున్నారు.


logo