ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 10, 2020 , 00:04:43

పనులను త్వరగా పూర్తి చేయాలి

పనులను త్వరగా పూర్తి చేయాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : వివిధ శాఖల ద్వారా చేపట్టి పురోగతిలో ఉన్న పనులను త్వరగతిన పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాతో కలిసి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల విస్తరణకు తక్షణమే చర్యలను తీసుకోవాలని, ముఖ్యంగా నాగవరం రోడ్డు విస్తరణ పనులు ఇదివరకు చేపట్టినందున చిట్యాల రోడ్డు, గోపాల్‌పేట రోడ్డుపై దృష్టి సారించాలన్నారు. రోడ్ల విస్తరణతో పాటు విద్యుత్‌ నీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో వేర్‌ హౌసింగ్‌ గోడాన్ల నిర్మాణానికి ప్రత్యేకించి వనపర్తి, పాన్‌గల్‌లో స్థలాన్ని గుర్తించాలని, అదేవిధంగా వేరుశెనుగ పరిశోధన కేంద్రానికి స్థలాన్ని ఫైనల్‌ చేయాలని మంత్రి సూచించారు. నాగవరం వద్ద పార్కు కోసం గుర్తించిన స్థలంలో నెలలోపు ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మున్సిపాలిటీ కమిషనర్‌ను ఆదేశించారు. పాన్‌గల్‌ మండలం నిలపలేని గుట్ట వద్ద టీఎస్‌ఎస్‌డీ గోదాం నిర్మాణానికి చర్యలను చేపట్టాలన్నారు. ఎకో పార్కు వద్ద వే సైడ్‌ మార్కెట్‌కు తక్షణమే స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పెబ్బేర్‌ మున్సిపాలిటీలో జాతీయ రహదారి మొదలుకుని పెబ్బేర్‌ టౌన్‌, తిరిగి జాతీయ రహదారి వరకు సెంటర్‌ డివైడింగ్‌ పనులు, లైటింగ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి వివరించారు. జిల్లా కేంద్రానికి అదనంగా 1500 డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, వనపర్తి, పెబ్బేర్‌లలో ఆగ్రో మెషినరి ఏర్పాటుకు తక్షణమే స్థలాలను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాల కింద పునరావాస కేంద్రాలకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా దవాఖానలో పనుల పూర్తికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, నాగవరం సమీపంలో 25 ఎకరాలలో ఆటోనగర్‌ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని, గొర్రెల రీసెర్చ్‌ కేంద్రానికి గుర్తించిన స్థలాన్ని ఫైనల్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. పట్టణంలో డీటీసీపీ అనుమతులు లేని లే అవుట్లపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో హరితహారం కింద మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. దాన్యం సేకరణకు వరి ద్యానం కొనుగోలు కేంద్రాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని, జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ తోటల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు వనపర్తి, పెబ్బేర్‌ పట్టణాలలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీలలో బడ్జెట్‌ కేటాయింపులు ముందుగా నిరుపేదలు మురుగు వాడలు దళిత వాడలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అనంతరం మంత్రి వనపర్తి పట్టణంలో రహదారి విస్తరణ పనుల కోసం కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. అంతేకాక నాగవరం సమీపంలోని వివిధ ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీలలో పార్కులకు స్థలాలను గుర్తించడంతో పాటు టాయిలెట్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించామని తెలియజేశారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

VIDEOS

logo