శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Mar 08, 2020 , 00:54:17

ఉపాధి పనులు వేగంగా చేపట్టాలి

ఉపాధి పనులు వేగంగా చేపట్టాలి

మక్తల్‌ టౌన్‌ : ఉపాధి హామీ పనుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, పనులు తక్కువగా ఉన్న చోట మరింత వేగంగా చేపట్టి.. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం మక్తల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన ఉపాధి హామీ పనులు, పల్లెప్రగతి సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్తల్‌, మాగనూర్‌, క్రిష్ణ, నర్వ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఏపీవోలు, పీఎస్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కనీస శాతం కూడా నమోదు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో హరితహారం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. 


మొక్కలకు ఫెన్సింగ్‌ ఏర్పాటుతో పాటు నిరంతరం నీటి సరఫరా చేపట్టి.. వాటిని బతికేట్లు చూడాలన్నారు. ఉపాధి హామీ పనులు నిరంతరం చేపడుతూ, ఉపాధి కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, పాఠశాలలు, రోడ్లు అన్నీ పరిశుభ్రంగా ఉంచి, పారిశుధ్యం ఉండేటట్లు చూడాలన్నారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులను నిరంతరం చేసేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం సామన్‌పల్లి గ్రామానికి పంచాయతీ ట్రాక్టర్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి కలెక్టర్‌ సర్పంచ్‌కు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo