కరోనా అలర్ట్

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా (కోవిద్-19).. ప్రస్తుతం ఎక్కడ విన్నా.. ఈ వైరస్ గురించే చర్చ. చైనాలో పుట్టిన ఈ వైరస్ పలు దేశాలకు ఇప్పటికే పాకింది. వేల మంది ప్రాణాలను ఈ వైరస్ తీసింది. ఇంకెందరినో దవాఖానల పాలు చేసి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఇప్పుడు మన మన దేశం, రాష్ట్రంలోనూ ప్రవేశించింది. దీంతో ప్రజలు హైరానా పడుతున్నారు. కరోనా పట్ల అవగాహన, జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వేళ వైరస్ తన ప్రభావాన్ని చూపే పరిస్థితులు ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లా వైద్యసిబ్బంది సమాయత్తం అవుతోంది. మరోవైపు విద్యాశాఖ సైతం విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొత్తంపై కరోనా మహమ్మారి జిల్లా దరి చేరకుండా అవసరమైన చర్యలను అధికారులు చేపట్టారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.
వైరస్ ఇలా సోకుతుంది
కరోనా వైరస్ కణాలు 400 నుంచి 500 మైక్రోసైజులో ఉంటాయి. దగ్గు, జలుబు ఉన్న వారిలో వెంటనే ప్రవేశించే అవకాశం ఉంది. అలా ప్రవేశించిన వారిలో రోగ నిరోధక శక్తిని తగ్గించి ఆరోగ్యాన్ని మరింతగా క్షీణింపజేస్తాయి. కరోనా సంక్రమించిన వారు వారు తుమ్మడం, దగ్గడం, కరచాలనం చేయడం, జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సంచరించడం, వైరస్ సోకిన వారితో కలిసి ప్రయాణాలు చేయడం వంటి కారణాలతో ఈ వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు నిర్ధారించారు. ఈ వైరస్ సోకిన వారిలో దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిమోనియా సోకి శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. 20 రోజలలో ప్రాణాలకే ముప్పు వస్తుంది. అందుకే వైరస్ సోకిన వారు 15 రోజులపాటు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాల్సి ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కోవిడ్-19 వైరస్ దరి చేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు పరిశుభ్రతకు ప్రాధాన్యతమివ్వాలన్నారు. ముఖాలకు మాస్కులు ధరించి పనులకు వెళ్లాలి. పనులు పూర్తయ్యాక, భోజనం చేసే సమయంలో సబ్బుతో, హ్యాండ్వాష్తో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇతరులతో ఎట్టి పరిస్థితులలో కరచాలనం చేయొద్దు. ఎదుటి వ్యక్తికి కనీసం 3 ఫీట్ల దూరంలో ఉండి మాట్లాడాలి. దగ్గు వచ్చినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాళ్లు అడ్డంగా పెట్టుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది. జనసందోహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. బట్టలను, శరీరాన్ని శుభ్రంగా ఉంచాలి. చల్లని ఆహార పదార్థాను తీసుకోకూడదు. కూరగాయలు, మాంసం పదార్థాలు బాగా ఉండికిన తర్వాతే తీసుకోవాలి. చల్లని ప్రదేశాలకు, విదేశీయులతో కూడిన ప్రయాణాలు చేయకూడదు.
అప్రమత్తమైన యంత్రాంగం
కరోనా వైరస్ బారిన ప్రజలు పడకుండా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా దవాఖానలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ వైరస్ సోకిన వారికి ప్రాథమిక వైద్య పరీక్షలు, చికిత్సలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను వైద్య సిబ్బంది ఏర్పాటు చేశారు. వైద్య సేవలు అందించేందుకు వీలుగా సిబ్బందికి తగిన తర్ఫీదును ఇచ్చి సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఓ గదిలో రెండు బెడ్లు కేటాయించారు. మరో వైపు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల విద్యార్థులకు సైతం కరోనాపై విద్యాశాఖ అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 01123978046 లేదా 104ను సంప్రదించవచ్చు.
24 గంటలపాటు అందుబాటులో..
కరోనాకు వ్యాధికి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా దవాఖానలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశాం. 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన కొన్ని మందులను సిద్ధంగా ఉంచాం. ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాం.
- సౌభాగ్యలక్ష్మి, డీఎంహెచ్వో, నారాయణపేట
తాజావార్తలు
- రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
- పీడీయాక్టు పెట్టినా మారలేదు..
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు
- జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నిక
- విక్టోరియాను ఉత్తమ బోధనా కేంద్రంగా మారుస్తాం
- రిమ్జిమ్ రిమ్జిమ్.. హైదరాబాద్