శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 04, 2020 , 05:36:05

ఖరీఫ్‌కు బేఫికర్‌

ఖరీఫ్‌కు బేఫికర్‌
  • ఉమ్మడి జిల్లాకు 40 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా
  • సీడ్స్‌ ప్రాసెస్‌, ప్యాకింగ్‌లపై దృష్టి
  • వచ్చే నెలలో సబ్సిడీ ధరల ప్రకటన
  • టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ కర్మాగారంలో మొదలైన కసరత్తు

వానాకాలం సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తుగా విత్తనాలను సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆ పనుల్లో నిమగ్నమైంది. ఉమ్మడి జిల్లా లక్ష్యానికనుగుణంగా టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ రైతుల నుంచి విత్తనాలను సేకరించి ప్రాసెస్‌, ప్యాకింగ్‌ చేసే పనులకు శ్రీకారం చుడుతున్నది. నాణ్యమైన విత్తనాలను అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ప్రధానంగా వరి, వేరుశనగ, కందులు, మినుములు, పెసర విత్తనాల ప్రాసెస్‌, ప్యాకింగ్‌ ప్రక్రియ చురుకుగా సాగుతున్నది. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అనంతరం సబ్సిడీ విత్తనాల ధరలను ప్రకటిస్తారు.                 

- వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైతాంగానికి ఏటా  వనపర్తిలోని టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ కార్మాగారం నుంచి వివిధ రకాల విత్తనాలను అందిస్తున్నారు. 20 ఏండ్లకు పైగా ఇక్కడి నుంచే ప్రభుత్వపరంగా ఆయా సీడ్స్‌ను సబ్సిడీలపై అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా వచ్చే వానాకాలం వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం వరి, వేరుశనగ, కందులు, పెసర్లు, మినుములు తదితర విత్తనాలను తయారు చేయాలని ప్రణాళిక చేసింది. వీటిలో వరి బీపీటీ రకంలో 10వేల క్వింటాళ్లను సిద్ధం చేస్తుండగా, వరిలోనే ఎంటీయూ 1010  మరో 6,500 క్వింటాళ్లు, మరో రకం ఆర్‌ఎన్‌ఆర్‌  వరి వంగడం  10, 500 క్వింటాళ్ల సీడ్‌ను సిద్ధం చేసుకునే విధంగా ప్రణాళిక ఉన్నది. ఇక  కేఎన్‌ఎం 118 రకం వంగడాలను 9 వేల క్వింటాళ్లు సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.  వీటితోపాటు 3వేల క్వింటాళ్ల కందులు విత్తనాలను సిద్ధం చేయాలన్న లక్ష్యం టీఎస్‌ఎస్‌డీసీఎల్‌కు ఉన్నది. అయితే వరిలో అన్ని రకాల విత్తనాలన్నీ దాదాపు 35,500 క్వింటాళ్లు ఇక్కడనే ప్రాసెస్‌, ప్యాకింగ్‌ చేయనున్నారు. అయితే, ఇవి కాకుండా ఇక్కడ అందుబాటులోలేని మినుములు, జీలుగ, జనుము, పెసర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని ఇతర జిల్లాల నుంచి 5వేల క్వింటాళ్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా వానాకాలం వ్యవసాయ విత్తనాల తయారీలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పనుల్లో నిమగ్నమైంది. 


ఏప్రిల్‌ వరకు సిద్ధం

సుమారు రెండు నెలల కాల వ్యవధిలో వానాకాలం రైతులకు అవసరమయ్యే విత్తనాలను సిద్ధం చేసేందుకు టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు ఇటీవలే ప్రాసెసింగ్‌ను ప్రారంభించిన అధికారులు మార్చితోపాటు ఏప్రిల్‌ నెల చివరి వరకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం వరిలో బీపీటీ రకం సీడ్‌ను సిద్ధం చేశారు. ఇంకా మిగిలిన  పనులను కొనసాగిస్తున్నారు. ఈ పనులను నిరంతరాయంగా చేస్తూ  రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించబోతున్నారు. టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ద్వారా ముందస్తుగా ఒప్పందం చేసుకున్న రైతుల నుంచి ధాన్యం సేకరించే పనులను కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు రైతుల  నుంచి 14వేల క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నది. మొత్తంగా ఏప్రిల్‌ చివరి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైతుల అవసరాలకు తగ్గట్టుగా వివిధ విత్తనాలను సిద్ధం చేయాలని టీఎస్‌ఎస్‌డీసీఎల్‌ సంకల్పంతో ఉన్నది. 


వచ్చే నెలలో సబ్సిడీ ధరలు

ప్రస్తుతం విత్తనాల ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ పనుల్లో ఉన్న టీఎస్‌ఎస్‌డీసీఎల్‌కు మార్చి అనంతరం సబ్సిడీ ధరలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వానాకాలం సీజన్‌కు సమయం ఉన్నందున ప్రస్తుతం వచ్చే సీజన్‌లోపు కొత్త ధరలను ప్రకటించే అవకాశం ఉంది.  ఏటా ప్రభుత్వం అన్నదాతలకు సబ్సిడీలపై నాణ్యమైన వరి విత్తనాలను అందిస్తున్నది. కొన్ని నకిలీ విత్తన కంపెనీలు  రైతులను బురిడీ కొట్టిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం నకిలీ విత్తన తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నది. ఈ మేరకు పీడీ చట్టాన్ని కూడా ఉపయోగించి రైతులను మోసం చేసిన వ్యాపారులను కట్టడి చేస్తున్నది. ఈ ఏడాది కూడా సీజన్‌లోపు నూతన సబ్సిడీ ధరలు రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయించిన అనంతరం అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.


లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించిన లక్ష్యాలను గడువులోపు పూర్తి చేస్తాం. ఇప్పటికే బీపీటీ విత్తనాలను సిద్ధం చేశాం. నిరంతరాయంగా కర్మాగారంలో పనులు కొనసాగిస్తాం. ప్రధానంగా వరి విత్తనాల ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ పూర్తి కాగానే ఇతర వాటిపై దృష్టి పెడుతాం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు గడువులోపు సిద్ధం చేస్తాం. గతేడాదిలో 42 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను ఉమ్మడి జిల్లాలో విక్రయాలు  జరిగాయి. వచ్చే సీజన్‌ అంచనాకు సరిపడా విత్తనాలను సిద్ధం చేస్తాం. 

- బిక్షం, మేనేజర్‌, టీఎస్‌ఎస్‌డీసీఎల్‌, వనపర్తి 

VIDEOS

logo