శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 02, 2020 , 23:45:31

వడివడిగా.. అక్షర తెలంగాణ వైపు

వడివడిగా.. అక్షర తెలంగాణ వైపు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలున్నాయి. వీటిలో జిల్లా వ్యాప్తంగా 5,77,758మంది (2011 లెక్కల ప్రకారం) జనాభా ఉంది. జిల్లాలో  సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లె గ్రామాలు మారాలని, ఇందుకు పునాధి అక్షరమే ఆయుధంగా పని చేస్తుందని ప్రభుత్వం భావించింది. కోటీ ఎకరాల మాగాణి లక్ష్యంగా సాగునీటి ఏర్పాట్లను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసినట్లుగానే అక్షరాలు దిద్దడాన్ని కూడా ఓ ఉద్యమంలా కొనసాగించేందుకు పట్టుదలగా కార్యాచరణ తీసుకుంటున్నారు. ప్రతి గ్రామం సంపూర్ణ అక్షరాస్యత వైపు నడిచేందుకు  సర్పంచులు, కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జిల్లాలో 1,53,228మంది

జిల్లాలోని 14 మండలాల్లో 1,53,228 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామాల్లో పనులు చేపట్టారు. ఇందులో భాగంగా  నిరక్షరాస్యుల గుర్తింపునకు సర్వేను చేపట్టారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశ  కార్యకర్తలు జిల్లాలోని అన్ని గ్రామాలల్లో 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న నిరక్షరాస్యులను గుర్తించారు. ప్రతి కుటుంబంలో చదువురాని వారి పేరు, వయస్సు, సామాజిక వర్గం, ఆధార్‌ నెంబర్‌, వృత్తి తదితర సమాచారం సేకరించారు. గ్రామాల వారీగా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. కాగా, పల్లెల్లో నిరక్షరాస్యులను గుర్తించిన ప్రభుత్వం తాజాగా పట్టణ ప్రగతిలో మున్సిపాలిటీల్లోను నిరక్షరాస్యులను గుర్తించే చర్యలను చేపట్టింది. ఈ మేరకు వనపర్తితో పాటు పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింతల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 

ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ ద్వారా..

ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మర్చేందుకు శ్రీకారం చుడుతున్నారు. పల్లె ప్రగతి విజయవంతం అయినట్లుగానే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజా ప్రతినిదులు, అధికారులు, యువకులు ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సి ఉంది. పల్లెల్లో నిర్వహించిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మంచి ఫలితాలు కనిపించాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమాన్ని కూడా సమన్వయంతో ముందుకు నడిపించాలని లక్ష్యంగా  పెట్టుకున్నారు. చదువు వచ్చిన వారు.. చదువురాని వారికి అక్షరాలు నేర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఉద్యోగులు, యువత, విద్యార్థులు, చదువుకున్న ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను పాల్గొనేలా చేస్తున్నారు. చదువురాని వారికి చదువు నేర్పించడం ఈచ్‌వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే, గతంలో సాక్షారభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ, మండల కోఆర్డినేటర్ల వ్యవస్థ ద్వారా ఈ పథకంను నడిపించినప్పటికీ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో అనుకున్న ఫలితాలు రాలేదు.

VIDEOS

logo