మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Mar 02, 2020 , 00:00:31

సాహస లక్ష్మీ

సాహస లక్ష్మీ

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఎల్లప్ప, కాశమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీ. తమ పిల్లలు చదువుకుంటేనే బతుకులు బాగు పడుతాయని భావించిన వారు సర్కారు బడుల్లో చదివిస్తూ వచ్చారు. 2009లో కాశమ్మ అనారోగ్యంతో మరణిచడంతో కుటుంబ పరిస్థితులు అయోమయంలో పడ్డాయి. అయినప్పటికీ ఎల్లప్ప బాధ నుంచి తేరుకొని తమ పిల్లల చదువులు ఆగకుండా కష్టపడ్డాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు నిరంతరం తపిస్తున్నాడు.  లక్ష్మి 5వ తరగతి వరకు తన స్వగ్రామంలోనే చదివి ఆర్థిక పరిస్థితుల వల్ల నారాయణపేటలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో చేరింది. అక్కడే పదో           తరగతి వరకు విద్యాభ్యాసం చేసింది. చదువుతోపాటు ఆటలు, కరాటేలో శిక్షణ పొందింది. ఎస్సెస్సీ పరీక్షల్లో 8.5గ్రేడ్‌ సాధించింది. మహబూబ్‌నగర్‌ రాంరెడ్డిగూడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎంఈసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తి చేసింది. ఇంటర్‌లో వెయ్యికి 700 మార్కులు సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నది. అనంతరం మహబూబ్‌నగర్‌ సాంఘిక గురుకుల డిగ్రీకళాశాలలో చేరి బీకాం కంప్యూటర్స్‌తో తన చదువును కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్ష్మికి కళాశాల చదువు తన ప్రత్యేకతను చాటుకునే అవకాశాలను కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువుతోపాటు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన కార్యక్రమాలు లక్ష్మికి కలిసొచ్చాయి.


హిమాలయ పర్వతాన్ని అధిరోహించాలన్నదే లక్ష్యం

హిమాలయ పర్వతాన్ని అదిరోహించాలన్నదే లక్ష్యం. లక్ష్యం ముందు మాది పేద కుటుంటం అన్న విషయం  మరిపించేలా చేసింది గురుకుల విద్యాసంస్థ. ఆఫ్రికాఖండంలోనే ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. అది కొందరికే సాధ్యం. అది నేను సాధించినందుకు గర్వంగా ఉంది. ఎముకలు కొరికే చలి, మంచు వానలు. ప్రతి కూల వాతావరణాన్ని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నాం. మొదట్లో కొంత భయం వేసినా లక్ష్యసాధన దిశగా ముందుకు కదిలాము. ఇదే  స్ఫూర్తితో హిమాలయపర్వతాన్ని అధిరోహంచేందుకు సన్నద్ధం అవుతాను. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

- ఎం లక్ష్మీ, కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థిని, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల, మహబూబ్‌నగర్‌


రాక్‌ ైక్లెంబింగ్‌కు ఎంపిక

గురుకుల విద్యార్థుల ద్వారా సాహసోపేత లక్ష్యాలను సాధించే లక్ష్యంతో రాష్ట్రంలోని 33 జిల్లాల గురుకుల కళాశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేసి 2019 అక్టోబర్‌లో ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు మహబూబ్‌నగర్‌ కళాశాల నుంచి లక్ష్మి ఎంపికయింది. పర్వతాలు ఎక్కడం, తాళ్లు ముడివేయడం, వాతావరణం అననూకూల పరిస్థితులను అధిగమించడం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 66 మందికి ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాల తర్వాత పరీక్షలు నిర్వహించి 16మందిని ఎంపిక చేశారు. వీరిలో లక్ష్మి అదే నెల చివరలో జమ్మూకశ్మీర్‌ వద్ద ఉన్న లద్దాక్‌లో ఐదురోజులు శిక్షణ పొందింది. కార్దూల్‌ పర్వతం, సిల్క్‌ రూట్‌ మౌంట్‌లో శిక్షణ పొందారు. అనంతరం కిలీమంజారో పర్వతారోహణకు మెదక్‌ జిల్లాకు చెందిన రజితతోపాటు లక్ష్మి అర్హత సాధించింది.


కిలి మంజారోపై విజయ పతాకం

దక్షిణాఫ్రికాలోని అత్యంత ఎత్తైన, క్లిష్టమైన కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించడం అంత సులభతరం కాదు. పట్టుదల, ధైర్యసాహసం ఉన్నవారికే ఇది సాధ్యం. లక్ష్మి అన్నివిధాల ధైర్య సాహసాలతో పర్వతాన్ని తన బృందం సభ్యులతో అధిగ మించింది. లక్ష్యసాధనకు 34కి.మీ పొడవున పయనించాల్సి ఉంటుంది. జనవరి 19న పర్వతారోహణకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజున 18కి.మీ. పయనించారు. 20న 11కి.మీ. పయనించి పర్వతాన్ని అధిరోహించే సాధ్యాసాధ్యాలను మరోసారి పరిశీలించి తిరిగి మొదటిరోజు చేరిన గమ్యస్థానానికి చేరుకున్నారు. 21న తమ ప్రయాణాన్ని ఆరంభించి 24న లక్ష్యాన్ని చేరుకున్నారు. జాతీయపతాకాన్ని, తెలంగాణ రాష్ట్ర గురుకుల విజయపతాకన్ని ఎగురవేసి తమకు ఈ అద్భుత అవకాశాన్ని కలుగడానికి కారకులు అయిన సీఎం కేసీఆర్‌, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చిత్రపటాలను ఉంచి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

VIDEOS

logo