ఎవరో....

మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు, జిల్లా సహకార సంఘాల డైరెక్టర్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సహకార పోరు నేడు చివరి ఘట్టానికి చేరుకుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంస్) చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు అవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. టీసీ నుంచి పీఏసీఎస్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల డైరెక్టర్ పదవుల వరకు వచ్చిన వారిలో పెద్ద పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో ఒకటే టెన్షన్ కనిపిస్తోంది. వివిధ సమీకరణాల నేపథ్యంలో పదవులు ఎవరికి వరిస్తాయో అర్థం కాక అంతా ఏం జరుగుతుందోననే మీమాంసలో ఉన్నారు. డీసీసీబీకి ఎన్నికైన 15 మంది, డీసీఎంస్‌కు ఎన్నికైన 7 మంది డైరెక్టర్లంతా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉన్న వారే కావడంతో పదవులున్నీ ఏకగ్రీవం అవుతాయని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పదవులు ఎవరు కైవసం చేసుకుంటున్నారు... ఆ అదృష్టజాతకులెవరనే దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
డీసీసీబీనే కీలకం...
జిల్లా సహకార సంఘాల్లో డీసీసీబీదే కీలక పాత్ర. రైతులకు రుణాలు అందించడంలో డీసీసీబీ ఎప్పటి నుంచో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు డీసీసీబీ మీదే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోని డీసీసీబీలో 87 ప్రాథమిక సహకార సంఘాలకు సభ్యత్వం ఉంది. వీటి పరిధిలో 16 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవాలి. అయితే రిజర్వేషన్ కేటగిరీ అయిన ఎస్సీ, ఎస్టీ పీఏసీఎస్ చైర్మన్లు లేనందున నాలుగు డైరెక్టర్ పోస్టులకు ఎన్నిక జరుగలేదు. బి కేటగిరీలో ఎస్సీ డైరెక్టర్ పోస్టుకు ఎన్నిక జరుగలేదు. మొత్తంగా డీసీసీబీలో 15 మంది డైరెక్టర్లున్నారు. వీరిలో అంతా టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే కావడం గమనార్హం. దాంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిపేందుకు పార్టీ అధిష్ఠానం నిశ్చయించింది. డీసీసీబీ చైర్మన్ పదవిని బీసీ అభ్యర్థికి గట్టబెడతారనే ప్రచారం నడుస్తోంది. డీసీసీబీ చైర్మన్ పదవిని బీసీకి అప్పగిస్తే డీసీఎంస్ చైర్మన్ పదవి ఓసీ అభ్యర్థికి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు.
డీసీఎంస్..
డీసీఎంస్‌కు 10 డైరెక్టర్ స్థానాలుంటే ఏడింటికి ఎన్నిక జరిగింది. ఎ కేటగిరీలో ఆరింటికి ఆరుగురు డైరెక్టర్లు ఎంపికయ్యారు. బి కేటగిరీలో మాత్రం నలుగురు డైరెక్టర్లకు గాను బీసీ అభ్యర్థి మాత్రమే డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్సీ 1, ఓసీ 2 డైరెక్టర్ స్థానాలకు ఎన్నిక జరుగలేదు. డీసీసీబీలోనూ అందరూ టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే. డీసీఎంస్ పదవులకు సైతం డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. డీసీసీబీ చైర్మన్ పోస్టు బీసీ అభ్యర్థికి ఇస్తే డీసీఎంస్ చైర్మన్ స్థానం ఓసీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేందుకు అధిష్ఠానం కసరత్తు చేసినట్లు సమాచారం.
అవకాశం తమకేనని భావిస్తున్న ఆ ముగ్గురు...
డీసీసీబీ చైర్మన్ అభ్యర్థులుగా ప్రస్తుతం పోటీలో ఉన్న ముగ్గురు మిగతా వారికంటే తమకే అవకాశం లభిస్తోందని భావిస్తున్నారు. ఇదమిద్దంగా ఎవరి పేరును అధిష్ఠానం ప్రకటించకున్నా తమకున్న సోర్స్ ప్రకారం తమకే సీటు కన్ఫాం అయ్యిందని ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అధిష్ఠానం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ డీసీసీబీ సైతం ఊహించని విధంగా కేటాయింపు జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ప్రధాన పోటీ అంతా చైర్మన్ గిరీ చుట్టే కొనసాగుతోంది. డీసీసీబీ చైర్మన్ ఓ సామాజిక వర్గానికి ఇస్తే... డీసీఎంస్ చైర్మన్ పదవి మరో సామాజిక వర్గానికి ఇచ్చి అందరినీ సంతృప్తి పర్చేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితై అభ్యర్థుల భవితవ్యం మాత్రం సీల్డ్ కవర్లో రానుందని పార్టీ నేతలు అంటున్నారు. అంత వరకు ఎవరెన్ని ఊహించుకున్నా అన్నీ ఊహాగానాలుగానే మిగలనున్నాయి. అదృష్టవంతులెవరో రేపు ఉదయం ఏకగ్రీవంగా వేసే నామినేషన్‌తో వెల్లడి కానుంది.
నామినేషన్ల స్వీకారానికి సన్నద్ధం..
డీసీసీబీ, డీసీఎంస్ పాలకవర్గాల ఎన్నిక కోసం అధికారులు నేడు ఉదయం 8 గంటల నుంచి డీసీసీబీ ఆడిటోరియంలో సిద్ధంగా ఉండనున్నారు. డైరెక్టర్ల పోస్టులే ఏకగ్రీవం అయిన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులకు పోటీ ఉండే పరిస్థితి లేనందును డైరెక్టర్లంతా వస్తే ఎన్నిక కేవలం కొన్ని నిమిషాల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది.
సీల్డ్‌కవర్‌తో వస్తున్న బండ ప్రకాశ్
డీసీసీబీ ఎన్నికలపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల జాబితాను పార్టీ ఎన్నికల పరిశీలకులకు అందించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన వారే ఎన్నికవుతారు. డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నిక పరిశీలకుడిగా నియమితుడైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ శనివారం ఉదయం పార్టీ అధిష్టానం అందించిన సీల్డ్ కవర్‌తో మహబూబ్‌నగర్‌కు చేరుకొని, అభ్యర్థులతో నామినేషన్ వేయిస్తారు.