బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 29, 2020 , 01:46:51

దేవాలయ భూములను పరిరక్షించాలి

దేవాలయ భూములను పరిరక్షించాలి

మద్దూరు : రాష్ట్రంలో దేవాదాయ భూముల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు దేవాదాయ శాఖ రాష్ట్ర స్పేషల్‌ గ్రేడ్‌ కలెక్టర్‌ రమాదేవి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 87వేల ఎకరాలు ఉండగా అందులో 24వేల భూములు అన్యాక్రాంతం అయినట్లు, ఉమ్మడి జిల్లాలో 15,450 ఎకరాలకు గాను 800 ఎకరాలు అన్యాక్రాంత కాగా 575 ఎకరాలు గుర్తించినట్లు ఆమె తెలిపారు. నారాయణపేట జిల్లాలో దేవాదాయ భూములు 1463 ఎకరాలకు గాను 111 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల నిర్వహించిన స్పేషల్‌ డ్రైవ్‌లో 400 ఎకరాలు గుర్తించినట్లు చెప్పారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిష్‌నర్‌ అనిల్‌కుమార్‌ భూముల గుర్తింపు, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. దేవాదాయ శాఖ, రెవిన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తు భూములను గుర్తింపు, సర్వే నిర్వహి స్తామని వెల్లడించారు. గుర్తించిన దేవాలయాలకు పారదర్శకంగా వేలం నిర్వహించి వచ్చిన ఆదాయంతో దేవాలయాల అభివృద్ధి చేపట్టనున్నట్లు వివరించారు. దేవాలయాల భూములకు ఓఆర్‌సీలు, పీటీలు చెల్లవని, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, తాగునీటి శాఖలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదని ఆమె సూచించారు. భూముల గుర్తింపునకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రికార్డుల గుర్తింపు, పరిశీలన, కోర్టు కేసులుగా విడివిడిగా చేపడతామని, రాష్ట్రంలో ముఖ్యమైన దేవాలయాలను గుర్తించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఈ సమావేశంలో మన్యంకొండ దేవాలయ ఈవో వెంకటచారి, తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ ఇన్‌స్పెక్టర్‌ కవితలు పాల్గొన్నారు.

VIDEOS

logo