మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Feb 29, 2020 , 01:45:19

2021-మార్చి నాటికి డబ్లింగ్‌ పనులు

2021-మార్చి నాటికి డబ్లింగ్‌ పనులు

మహబూబ్‌నగర్‌ క్లాక్‌టవర్‌ : 2021 మార్చి వరకు డబ్లింగ్‌ పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ డీఆర్‌ఎం సీతారాం ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరి షాద్‌నగర్‌, బాలానగర్‌, గొల్లపల్లి, జడ్చర్ల, తదితర రైల్వే స్టేషన్లలో తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఎం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫలక్‌నామా నుంచి హుందానగర్‌ వరకు పనులు ఈ మార్చి 2020 వరకు పూర్తవుతాయని, బుద్వేల్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు ఏప్రిల్‌ 2020 వరకు పూర్తి చేస్తామన్నారు. చివరగా వచ్చే మార్చి 2021 వరకు మహబూబ్‌నగర్‌ వరకు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ డబుల్‌ లైన్‌ పనులు డోన్‌ వరకు ఉందన్నారు. డబుల్‌ లైన్‌ పనులు పూర్తయితే పాలమూరు స్టేషన్‌కు లిఫ్ట్‌ ఎస్క్యులెటర్‌ వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ చాలా శుభ్రంగా ఉందని ఆయన కితాబిచ్చారు. అలాగే ప్రయాణికులు కూడా సహకరించాలని కోరారు. కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్లు చాలా శుభ్రంగా ఉన్నాయన్నారు. అలాగే లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హాల్‌ నిర్మించామని, అందులో భాగంగా అన్ని కనీస వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆదాయాన్ని బట్టి మాడల్‌ స్టేషన్‌గా మార్చడానికి, తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. 


డీఆర్‌ఎంకు వినతుల వెల్లువ 

శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌ నగర్‌కు వచ్చిన డీఆర్‌ఎం సీతారాం ప్రసాద్‌కు, మజ్దూర్‌ యూనియన్‌ బ్రాంచి కార్యదర్శి జానకి రామయ్య వినతిపత్రం ఇచ్చారు. రైల్వే శాఖలో పని చేస్తున్న ఎలక్ట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందికి క్వార్టర్స్‌ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  అలాగే రైల్వే గోదాం నుంచి న్యూ మోతీనగర్‌కు వెళ్లే దారికి 30 ఫీట్ల రోడ్డును ఇవ్వాలని డీఆర్‌ఎంకు స్థానిక 35వ వార్డు కౌన్సిలర్‌ జాజిమొగ్గ నర్సిములు, న్యాయవాది చక్రవర్తి, ఆటో యూనియన్‌ నాయకుడు రాజు తదితరులు డీఆర్‌ఎంను కోరారు. అంతేకాకుండా ఎఫ్‌వోవీ న్యూమోతీనగర్‌ నుంచి రాజేంద్రనగర్‌ వరకు నిర్మించాలని వారు కోరారు. అలాగే కాచిగూడ- గుం టూరు, గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చాలన్నారు. వాటి ప్రయాణం వల్ల అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే దేవరకద్ర, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్‌ టౌన్‌ హాల్ట్‌ స్టేషన్‌లలో రైలును నిలుపుదల చేయాలని విశ్రాంత ఉద్యోగి భగవంతు, కే.జగదీశ్‌, ఆనందమ్మ, సాయి, విజయ్‌, కృష్ణయ్య తదితరులు పేర్కొన్నారు. అంతకుముందు మజ్దూర్‌ యూనియన్‌ బ్రాంచి కార్యదర్శి జానకి రామయ్య డీఆర్‌ఎం శాలువా కప్పి ఘ నంగా సన్మానించారు. అనంతరం ప్రత్యే క రైలులో గద్వాల - కర్నూల్‌ స్టేషన్లను తనిఖీ చేయడానికి డీఆర్‌ఎం బయలు దేరారు. 

VIDEOS

logo