ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 27, 2020 , 23:10:32

కంది రైతుకు ఊరట

కంది రైతుకు ఊరట

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో రైతుల కష్టాలు గట్టెక్కుతున్నాయి. మధ్యలో నిలిచిన కంది కొనుగోళ్లను పునరుద్ధరించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది.  కేవలం రాష్ట్ర ప్రభుత్వమే 13 వేల మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం శుభపరిణామం. జిల్లాలో వానాకాలంలో రైతులు 31,300 ఎకరాల్లో కంది పంటసాగు చేశారు. వర్షాలు అనువుగా లేకపోయినా ఎత్తిపోతల పథకాల నీరు అందుబాటులో ఉండటంతో ఈ ఏడాది కంది పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. గత నవంబర్‌ నుంచి రైతులు కంది పంట కోతలు చేశారు. చేతికొచచ్చిన కంది పంటను మార్కెట్‌లో విక్రయించారు. క్వింటాలు కందులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5800 నిర్ణయించింది. ప్రైవేటు వ్యాపారులు రైతులకు మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారు. తక్కువ ధరకు కందులు తీసుకోవడంతో  రైతులు ప్రభుత్వ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వ ధరకు, ప్రైవేట్‌ వ్యాపారులకు క్వింటాలుకు వెయ్యి రూపాయలు అటు, ఇటుగా నష్టం వస్తున్నది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు రావడంతో డిమాండ్‌ పెరిగింది. కేంద్రం టార్గెట్‌ మేరకే కందులను కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులు నిరాశకు గురయ్యారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఊరట

ఈ ఏడాది కంది దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ఎటు చూసినా కందిపంట కనిపిస్తున్నది. కేంద్రం కందుల కొనుగోలుపై కొంత అటు, ఇటు అయ్యిం ది. తన లక్ష్యం వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన పడ్డారు. దీనిపై ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ముందుకొచ్చింది. రూ.5800 చొప్పున ప్రభుత్వమే క్వింటాలు కందులకు చెల్లించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 13 వేల మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలుకు సిద్ధం కావడం సంతోషకరం. జిల్లాలో మూడు రోజులుగా ఐదు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు నిర్వహిస్తున్నారు. నా ఫెడ్‌ ద్వారా 31,737 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా 9,060 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. జిల్లాలో వనపర్తి, పెబ్బేరు,  చిన్నంబాయి, మదనాపురం, ఆత్మకూరు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి.

మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో..

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో కంది రైతుల సమస్య కొలిక్కి వచ్చింది. ప్ర భుత్వ కొనుగోలు సెంటర్లు లేకుంటే నష్టంతో రైతు లు ప్రైవేట్‌ వ్యాపారులకు కందులను విక్రయించుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని స్వయంగా గుర్తించిన మంత్రి సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కందుల సమస్యపై స్పందించిన సీఎం నా ఫెడ్‌ లక్ష్యం పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభు త్వం 13 వేల మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేసే విధంగా నిర్ణయించడంతో కంది రైతులకు ఊరట లభించింది. ముందు నుంచి కంది రైతులు అధైర్యపడొద్దని చెప్పిన మంత్రి ఎట్టకేలకు ప్రభుత్వం ద్వారా కందిని కొనుగోలు చేయించేలా చూడడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

VIDEOS

logo