శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 27, 2020 , 03:50:10

పట్టణ ప్రగతికి దిశ దశ

పట్టణ ప్రగతికి దిశ దశ

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలను రూపుమాపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కార్యచరణ పట్టణ ప్రగతి. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌లో ప్రారంభించడంతో పార్టీలో, నాయకుల్లో నూతనోత్సాహం నిండింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా పనిచేస్తూ తెలంగాణ సాధించారని అందుకే పాలమూరు అంటే తనకు ప్రత్యేక అభిమానమంటూ’ చేసిన ప్రసంగం ప్రజలకు మరింత దగ్గర చేసింది. తొలిరోజు మహబూబ్‌ నగర్‌లో, రెండో రోజు కల్వకుర్తిలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న కేటీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాపై తన అభిమానాన్ని చాటుకున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. పల్లెప్రగతి ద్వారా పల్లెల సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన ప్రభుత్వం పట్టణ ప్రగతితో పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి పట్టణ ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంపైనా మున్సిపల్‌ పాలకవర్గాలకు, అధికారులకు, సామాన్య ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌, కల్వకుర్తిలో జరిగిన పట్టణ ప్రగతి సభల్లో ఏకధాటిగా గంటకుపైగా కేటీఆర్‌ ప్రసంగం సాగిందంటే ఈ కార్యక్రమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మంత్రి పర్యటనపై మహబూబ్‌ నగర్‌, కల్వకుర్తిలో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మహబూబ్‌నగర్‌లో పాత తోటలో..

మహబూబ్‌నగర్‌ పట్టణ ప్రగతి సందర్భంగా పాత తోటలో సుమారు గంటకుపైగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ పాదయాత్ర చేపట్టారు. తమను కలిసి మంత్రి తమతో మాట్లాడిన తీరుపట్ల స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి ముందు ఉన్న చెత్తను తొలగించుకునే విషయం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంపై తమకు ఎంతో శ్రద్ధగా వివరించాడని వేణమ్మ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపింది. కేటీఆర్‌ తమ శ్రేయోభిలాషిలా, తమ బిడ్డల అనిపించాడని పేర్కొంది. ఆయన చెప్పినట్లుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని తెలిపింది. 

కల్వకుర్తిలో పట్టణ ప్రగతిపై స్థానికుల సందేహాలు

కల్వకుర్తి పట్టణ ప్రగతిలో స్థానికులు తమ సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన కేటీఆర్‌ను పట్టణవాసులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కల్వకుర్తి లైబ్రరీ వద్ద వైన్‌ షాపు వల్ల పడుతున్న ఇబ్బందిని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకుపోగానే వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది కొరత, వార్డు కార్యాలయాల ఏర్పాటు, స్థానిక సమస్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందన అపూర్వమని కొనియాడుతున్నారు. ఇలాంటి మున్సిపల్‌ మంత్రి ఉంటే పట్టణాలు అత్భుతంగా మార్పుచెందుతాయంటున్నారు. బాధ్యత అంత ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులపై వేయకుండా తాము సైతం తమ పట్టణాల అభివృద్ధికి పాటుపడతామని పేర్కొంటున్నారు. logo