85శాతం మొక్కలు బ్రతకాలి

మహబూబ్ నగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం పారిశుద్ధ్యానికి మరోపేరుగా నిలుస్తున్నదని... ఆ నగరాన్ని తలదన్నేలా మహబూబ్ నగర్‌ను మార్చాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కృతనిశ్చయంతో ముందుకు సాగితే ఇదేమీ పెద్ద విషయం కాదన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లిలో ఉన్న వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు, ప్రత్యేక అధికారులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన విశేష అనుభవం ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇండోర్‌ను తలదన్నేలా మహబూబ్ నగర్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.
బల్దియాకు సరైన నిర్వచనం ఇద్దాం
సీఎం కేసీఆర్ చెప్పినట్లు బల్దియా అంటే ఖాయా పీయా చల్దియా కాదని నిరూపించేందుకే ఆయన గంటల కొద్దీ కసరత్తు చేసి మున్సిపల్ చట్టం తీసుకువచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అత్యంత సమస్యలుండే ప్రాంతాలను గుర్తించాలని అక్కడి నుంచే ప్రారంభించాలని సీఎం సూచించారని తెలిపారు. సీఎం సూచించిన మేరకే మహబూబ్ నగర్లోదళితులు అత్యధికంగాజీవించే పాతతోటలో పాదయాత్ర చేశారని, ఇంటింటికీ శుద్ధ జలం అందుతున్నదని, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు. తదితర అంశాల్లో వారు సంతోషంగా ఉన్నారన్నారు. ఒక్క పాతతోటలోనే 90 డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
సిరిసిల్ల తరహాలో చెత్తతో కరెంటు తయారు చేద్దాం
పాతతోట పాదయాత్రలో భాగంగా చాలా విషయాలు గమనించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. చెత్త సేకరణకు కార్మికులు రాకుంటే మున్సిపల్ కమిషనర్‌కు కాకుండా నేరుగా సంబంధిత కార్మికుని ఫోన్ చేసేలా ప్రజలకు వారితో సంబంధాలు ఏర్పాటు కావాలన్నారు. సిరిసిల్లలో చెత్త ద్వారా విద్యుత్, ఎరువులను తయారు చేస్తూ నెలకు రూ. 3 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారని తెలిపారు. అంత కన్నా ఎంతో పెద్దదైన మహబూబ్ నగర్లో తడిచెత్త ద్వారా ఎరువులు, పొడి చెత్త ద్వారా విద్యుత్ తయారు చేసేందుకు అవకాశం ఉందని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 14 రోజులకోసారి తాగునీరు వచ్చేదని, ప్రస్తుతం నిత్యం ప్రజలకు శుద్ధమైన జలం
అందిస్తున్నామన్నారు.
85 శాతం మొక్కలు బతుకకుంటే..
కొత్త చట్టం ప్రకారం మున్సిపాలిటీ బడ్జెట్లో 10శాతం పచ్చదనం పెంచేందుకే వినియోగించాలని మంత్రి కేటీఆర్ కోరారు. 85 శాతం మొక్కలు బతకలేదంటే కౌన్సిలర్ల పోస్టు పోతుందన్నారు. ఆ పరిస్థితి వస్తే సీఎం కేసీఆర్ గానీ, నేను గాని, మంత్రులు, ఎమ్మెల్యేలు గాని కాపాడలేరని తెలిపారు. వార్డుల్లోని 60 మందితో కూడిన కమిటీలు సైతం ఈ విషయంలో పక్కాగా పనిచేయాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభించే టీఎస్ బిపాస్ చట్టం ద్వారా ఇంటి అనుమతుల కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండబోదని మంత్రి కేటీఆర్ అన్నారు. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి రూ.1 ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకుంటే చాలని తెలిపారు.
ఇప్పటి వరకు 3700 డబుల్ ఇండ్లు
ఎక్కడా లేని విధంగా మహబూబ్ నగర్‌కు అత్యధిక డబుల్ బెడ్రూం గృహాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీసుకువచ్చారని కేటీఆర్ అన్నారు. 3,700 ఇండ్లు తీసుకువచ్చారని ఆయన తెలిపారు. పట్టణంలో ఇంకా అవసరమైన వారికి డబుల్ బెడ్రూ గృహాలు అందిస్తామన్నారు. పట్టణ ప్రగతిలో అక్షరాస్యతపైనా దృష్టి సారిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. శ్మశాన వాటికలకు పాలమూరులో సరిపడ స్థలాలు కేటాయించారని మంత్రి తెలిపారు. ముస్లింల కోసం 12 ఎకరాలు, క్రైస్తవులకు 4 ఎకరాలు, హిందువుల శ్మశాన వాటికల కోసం 30 ఎకరాలు అందించినట్లు కేటీఆర్ తెలిపారు.
ప్రత్యేకాధికారులేరీ.. కలెక్టర్ గారు..
సమావేశంలో ప్రత్యేక అధికారులపై కేటీఆర్ మాట్లాడారు. ప్రతి వార్డుకో శాశ్వత ప్రత్యేకాధికారని నియమించామన్నారు. మహబూబ్ నగర్లో 49 వార్డులకు 49 మందిని నియమించినట్లు తెలిపారు. వారంతా ఓ సారి చేతులెత్తాలని మంత్రి కోరారు. అయితే దాదాపు అందులో సగం మంది మాత్రమే చేతులెత్తారు. సమావేశానికి వచ్చిన వార్డు ఆఫీసర్లు 49 మంది కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ కలెక్టర్ వెంకట్రావును ప్రశ్నించారు.
శ్రీనివాస్‌గౌడ్ పనితీరుకు జనం కితాబే నిదర్శనం
వీధి వ్యాపారుల కోసం వెండింగ్ జోన్ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో తనకో ఆసక్తికర అనుభవం చోటుచేసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి అక్కడికి వచ్చి ‘మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొనగాడు... 60 ఏండ్లలో కాని అభివృద్ధిని కేవలం 6 ఏళ్లలో చేసి చూపించాడు’ అని అన్నట్లు కేటీఆర్ తెలిపారు. జడ్చర్ల- మహబూబ్ నగర్ రోడ్డు విస్తరణతో సహా అనేక పనులు చేశాడని ఆ రిటైర్డ్ ఉద్యోగి అన్నట్లుగా కేటీఆర్ సభలో తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ పనితీరుకు ఈ కితాబే నిదర్శమన్నారు.
తాజావార్తలు
- చౌకధరకే టెస్లా విద్యుత్ కారు!
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్