శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 21, 2020 , 02:24:03

చేనేతకు చేయూతనివ్వండి

చేనేతకు చేయూతనివ్వండి

చేనేత కార్మికులకు రుణాలను ఇవ్వాలని కలెక్టర్‌ హరిచందన బ్యాంకు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా ట్రాక్టర్ల రుణాలను రెండు రోజులలో మంజూరు చేయాలని పేర్కొన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ హరిచందన మా ట్లాడారు.

  • నేత కార్మికులకు రుణాలు అందించాలి
  • ట్రాక్టర్ల కోసం రెండ్రోజుల్లోనే ఇవ్వాలి
  • కూరగాయల సాగును ప్రోత్సహించాలి
  • పేపరు బ్యాగుల తయారీతో ప్లాస్టిక్‌కు చెక్‌
  • బ్యాంక్‌ అధికారులతో కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌ : చేనేత కార్మికులకు రుణాలను ఇవ్వాలని కలెక్టర్‌ హరిచందన బ్యాంకు అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా ట్రాక్టర్ల రుణాలను రెండు రోజులలో మంజూరు చేయాలని పేర్కొన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ హరిచందన మా ట్లాడారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు, మైనార్టీలకు బ్యాంకు రుణాలను సకాలంలో అందించి తోడ్పాటు నందించాలని చెప్పారు. జిల్లాలో పేపరు బ్యాగులను తయారు చేసే యూనిట్లను ప్రోత్సహించి ప్లాస్టిక్‌ వినియోగం పూర్తిగా నిషేధించాలని సూచించారు. పీఎంఈజీఎస్‌ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఉపాధి కల్పించాలని తెలిపారు. గ్రామాల వారీగా మండల సమాఖ్య సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి మొండి బకాయిలను చెల్లించేందుకు అవగాహన కల్పించాలన్నారు. పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు క్రెడిట్‌ కార్డులను జారీ చేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పందిళ్లు వేసి కూరగాయలు పండించే రైతులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎల్‌డీఎం ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో 11 బ్యాంకులు ఉన్నాయని, 42 శాఖలు పని చేస్తున్నాయని చెప్పారు. ప్రతి బ్యాంకు శాఖలో అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నాయని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ అధికారి చంద్రకాంత్‌, ఏజీఎం నాబార్డు భార్గవన్‌, జెడ్పీ సీఈవో కాళిందిని, అగ్రికల్చర్‌ అధికారి జాన్‌ సుధాకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి యాదయ్యగౌడ్‌, బీసీ వెల్ఫేర్‌ కృష్ణమాచారి, హర్టికల్చర్‌ అధికారి ప్రకాశ్‌పాటిల్‌, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 


వార్డ్‌ వాక్‌లో సమస్యలు గుర్తించాలి

నారాయణపేట టౌన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా ఈనెల 24వ తేదీన వార్డ్‌ వాక్‌ నిర్వహించి సమస్యలను గుర్తించాలని, గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ హరిచందన మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్‌ మున్సిపాలిటీల కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. మున్సిపాలిటీలలో ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించామని, ఇందులో భాగంగా 24న నిర్వహించే వార్డ్‌ వాక్‌లో అధికారులు, వార్డ్‌ కౌన్సిలర్‌లతో కలిసి వార్డులలో పర్యటించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు శ్రీనివాసన్‌, ఖాజాహుస్సేన్‌, పావని తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo