గురువారం 04 జూన్ 2020
Narayanpet - Feb 20, 2020 , 00:38:28

కమ్మనైనది అమ్మభాష

కమ్మనైనది అమ్మభాష


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : మనషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరు అని చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష ప్రతి ఒక్కరికీ సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా మాతృభాష వస్తుంది. అమ్మ మాటే మాతృభాష అవుతుంది. అందుకే ప్రతి బిడ్డను అమ్మ కాపాడుకున్నట్లు మాతృభాషను కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తించేందుకే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్స వాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహిస్తున్నారు. యునెస్కో 30వ సాధారణ మహాసభ 1999లో నవంబర్‌ 17న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. అందులో భాగంగా 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాష సంస్కృతిక వైవిద్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో భావించి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఒక్కరూ మాతృభాషను కాపాడుకుంటూనే తక్కిన భాషలన్నింటినీ నేర్చుకొని అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం.


దేశభాషలందు తెలుగులెస్స

దేశభాషలందు తెలుగులెస్స అని కృష్ణదేవరాయలు తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం, ఇంకా ఏ భాషలో లేదని, చాలా మంది కవులు తెలిపారు. తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా చాటి చెప్పారు. కానీ ప్రస్తుతం తెలుగు భాషపై రోజురోజుకూ ప్రభావం తగ్గి ఇతర భాషలపై వ్యామోహం పెంచుకుంటున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు మీడియాన్ని పక్కకు నెట్టి ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు కొనసాగుతున్నాయి. ఇంగ్లిష్‌ వస్తేనే గుర్తింపు వస్తుంది. మాతృభాషలో మాట్లాడేవారిని చిన్నచూపు చూస్తున్నారు. తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని నేటి యువతకు, విద్యార్థులకు తెలియజెప్పకుండా మరుగన పడేలా  విద్యా సంస్థలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. 


రానున్న కాలంలో తెలుగు భాష మరింత వెనుకబడిపోయే ప్రమాదం లేకపోలేదు.  ఇంగ్లిష్‌ భాష నేర్వడం అనేది అవసరమే కానీ,  అదే భాషపై మోజు ఏర్పడకూడదు. విజ్ఞాన సముపార్జనే ధ్యేయం కావాలని, భాషలపై మోజు పడకూడదు. ఇతర భాషలపై మోజు పెంచుకొని మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  సుసంప న్నమైన మన భాష సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం  మన భాష సంస్కృతిని కాపాడుకోవడం భావి తరాల వారికి దీనిని అందించడం భాషా సౌందర్య సంపదను కాపాడుకోవడం అందరి కర్తవ్యం కావాలి.  నేటి ప్రపంచంలో  దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకమైన పనుల కోసం ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్లడం సాధారణమైంది. అందువల్ల ఇంగ్లిష్‌  అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. అయిన ప్పటికీ తెలుగుభాష గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజెప్పి భాష పరీరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


నేడు పాఠశాలల్లో వేడుకలు : డీఈవో

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉషారాణి ఆదేశించారు. యునెస్కో మార్గదర్శకాల  మేరకు ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవ వేడుకలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలకు సెలవు ఉన్నందున గురువారం మాతృభాష దినోత్సవ వేడుకలను అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని ఆమె సూచించారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన ప్రణాళికను రూపొందించుకొని మాతృభాషా దినోత్సవ  కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, భాషోపాధ్యాయులు సమిష్టిగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.  

మాతృభాషా దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన, క్విజ్‌ వంటి పోటీలతో పాటు మాతృభాష ఆవశ్యకతను తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాల స్థాయిలో నిర్వహించాలని సూచించారు. పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను ప్రదర్శనకు ఉంచాలని, తల్లిదండ్రులను, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమం తిలకించేలా కృషి చేయాలని ఆదేశించారు. 




logo