శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 20, 2020 , 00:34:41

బ్రహ్మోత్సవ శోభ

బ్రహ్మోత్సవ శోభమూసాపేట : మండలంలోని పోల్కంపల్లి గూంపోల్‌గుట్టు శారద చంద్రమౌళీశ్వరస్వామి (మల్లయ్య) జాతర గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ ఉత్సవాలు నాలుగు రోజులపాటు వైభవంగా జరిపించేందుకు గ్రామస్తులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు గురువారం వార్షికోత్సవం, గణపతి పూజ, పుణ్యాహవచనం, ఏకదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, చండీ హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 21న అభిషేకం, అర్చనలతో ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారు. 4 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. రాత్రి 9 గంటలకు లింగోద్భవ అభిషేకం, శారదా చంద్రమౌళీశ్వరస్వామి వారికి కల్యాణం జరిపిస్తారు. 22వ తేదీన పూజా కార్యక్రమాలతో పాటు, బోనాల ఊరేగింపు ఉంటుంది. 23వ తేదీన శకటోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 


ఆలయ ప్రత్యేకత

స్వామివారి ఆలయం ఎతైన కొండ.. కొండపై అతి పురాతన శివాలయం.. చుట్టూ పచ్చని పంట పొలాలు.. నిర్మలమైన వాతావరణం.. అక్కడికి వెళ్లిన వారికి మానసిక ప్రశాంతత కలుగడంతోపాటు అక్కడ గడిపినంత సమయం అంతా మైమరిచి స్వామివారి సేవలో నిమగ్నమైపోతారు. స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించిన వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దేశం మొత్తంలో మహాశివుడికి 11 అవతారాలలో వేరువేరు చోట్ల భక్తులకు దర్శనమిస్తాడు. కానీ, ఈ ఆలయంలో 11 అవతారాలతో ఒకేచోట భక్తులకు దర్శనమిస్తాడు. అవి 1) దక్షిణామూర్తి, 2) తరుణ గణపతి 3) హరిహర మూర్తి, 4) షణ్ముఖ స్వామి, 5) కాలభైరవ మూర్తి, 6) గంగాధర మూర్తి, 7) అర్థనారీశ్వర మూర్తి 8) భిక్షాటన మూర్తి, 9) గణ సంహరమూర్తి, 10) నటరాజ మూర్తి, 11) కాల సంహార మూర్తి అవతారాల్లో భక్తులకు దర్శనం లభిస్తుంది. అన్ని అవతారాలను దర్శించుకోవాలంటే దేశం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది. కానీ పోల్కంపల్లి శారధ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయానికి వెళ్తే అన్ని అవతారాలను ఒకేచోట దర్శించుకునే అదృష్టం లభిస్తుంది.


ఆయానికి దారి

మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లి శివారులోని గూంపోల్‌ గుట్టపై ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్లే  జాతీయ రహదారిపై అన్నాసాగర్‌ దాటిన తర్వాత ఎడమ వైపు పోల్కంపల్లి గ్రామం ఉంటుంది. గ్రామం వరకు బీటి రోడ్డు, అక్కడి నుంచి గుట్ట 2 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంటుంది. ఆ గుట్టపైనే చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం.


నిత్యాన్నదాన సత్రం

ఆలయానికి రోజురోజుకు భక్తుల సందర్శన పెరుగుతుండటంతో ఆలయ నిర్వాహకులు, సర్పంచ్‌ తూము అనితాశ్రీకాంత్‌రెడ్డి, వికాస తరంగిణి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అనితాశ్రీకాంత్‌రెడ్డి ఆలయానికి పక్కనే రెండంతస్తుల భవనం నిర్మించారు. అందులో నిత్యాన్నదానం చేపట్టడంతోపాటు, విడిది సత్రాలను ఏర్పాటు  చేశారు. 


ఆలయంలో ప్రత్యేక పూజలు

శారద చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం అభిషేకం చేస్తారు. ముగ్గురు పురోహితులు అభిషేక పూజలు చేయిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలు, ప్రతి మాస శివరాత్రి రోజు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. అదేవిధంగా కల్యాణానికి అవసరైన పూజా సామగ్రిని భక్తులే తీసుకొని వెళ్తే కల్యాణం చేయించడంతోపాటు, వారితోపాటు ఎంత మంది వచ్చినా వారందరికి ఉచిత భోజన సవతి ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా నిత్యం స్వామివారికి అభిషేకం అర్చనలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. 

VIDEOS

logo