గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 20, 2020 , 00:30:03

పారదర్శక పాలన వైపు అడుగులు

పారదర్శక పాలన వైపు అడుగులు


మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మున్సిపల్‌ చైర్మన్లంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కొత్తగా ఎంపికైన మున్సిపల్‌ చైర్మన్లను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మున్సిపాలిటీలకు ఉన్న చెడ్డపేరు చెరిపేయాలని కోరారు. బల్దియా అంటే ఖాయ, పీయా, చల్దియా కాదని నిరూపించాలన్నారు. అన్ని పనుల్లోనూ పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. సీఎం ప్రసంగం విన్న మున్సిపల్‌ చైర్మన్లు ఎంతో సంతోషంగా తమ పట్టణాలకు తిరిగి వచ్చారు. మున్సిపాలిటీలపై ఆయనకున్న విజన్‌కు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఓ ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యవస్థను కళ్లకు కట్టినట్లు వివరించడం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు మున్సిపాలిటీలు అంటే అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేవని, ఆ పరిస్థితిని మారుస్తామని మున్సిపల్‌ చైర్మన్లు అంటున్నారు. 


గతంలో ఒకలా ఇప్పుడు మరోలా పరిస్థితి మార్చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవినీతి రహితంగా పాలన అందిస్తూ పారదర్శకంగా పనిచేస్తామని చెబుతున్నారు. తాము తప్పు చేసినా తమను శిక్షించేందుకు కొత్త మున్సిపాలిటీ చట్టం కత్తి ఎప్పుడూ తమ గొంతుపై వేలాడుతూనే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అందుకే ఎలాంటి తప్పు చేయకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెబుతున్నారు. ప్రతి నెతి ఒకటో తారీఖున ఠంఛనుగా మున్సిపాలిటీలకు నిధులను అందిస్తామని సీఎం స్పష్టం చేయడంపై చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రగతి కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామంటున్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే పట్టణ ప్రగతి కోసం ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. ఎలాగైనా మున్సిపాలిటీల్లో అభివృద్ధి సాధించాలనే ఏకైక లక్ష్యంతో మున్సిపల్‌ చైర్మన్లు సిద్ధమవుతున్నారు.

VIDEOS

logo