శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 16, 2020 , 00:01:32

ప్రభుత్వ భూములను గుర్తించాలి

ప్రభుత్వ భూములను గుర్తించాలి
  • జిల్లాలో మెగా పరిశ్రమలను ప్రోత్సహించాలి
  • అధికారులతో ప్రత్యేక సమావేశం

నారాయణపేట నమస్తే తెలంగాణ : జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకుగాను వివిధ మండలాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి పూర్తి నివేదికలను సమర్పించాలని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందనలు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే, కలెక్టర్‌లు మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లాలో మెగా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్‌ మండలాల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ అధికారిని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన అధికారులందరూ సమన్వయంతో ప్రభుత్వ భూములను పరిశీలించి నివేదికలు అందజేయాలని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా ఎమ్మేల్యే రాజేందర్‌ రెడ్డి మెగా పరిశ్రమను స్థాపించేందుకు సంకల్పించినట్లు జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌వో రవికుమార్‌, ఆర్‌డీవో శ్రీనివాసులు,  పరిశ్రమల జీఎం రామసుబ్బయ్య, పారెస్ట్‌ అధికారి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలి : కాళిందిని

నారాయణపేట టౌన్‌ : జిల్లా ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్‌ హరిచందన ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదిన జిల్లాలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారిణి కాళిందిని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని గ్రామాలలో కాసుఅలిటీ రీప్లేస్‌మెంట్‌ అండ్‌ హోమ్‌ స్టడ్‌ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. 


కలెక్టర్‌, డీఈవోకు కృతజ్ఞతలు

నారాయణపేట రూరల్‌ : 2013 సంవత్సరం నుంచి అపరిష్కృతంగా ఉన్న పేట జిల్లా క్యాడర్‌ స్ట్రెన్త్‌ను పరిష్కరించేందుకు కలెక్టర్‌ హరిచందన, డీఈవో రవీందర్‌లు  ఉపాధ్యాయుడు ఉదయ భాస్కర్‌ను డిప్యూటేషన్‌పై నియమించారు. ఆ ఉపాధ్యాయుడు క్యాడర్‌ స్ట్రెన్త్‌ను పరిష్కరించారు. దీంతో 2017 టీఆర్‌టీ ద్వారా నియమితులయిన ఉపాధ్యాయు ల జీతభత్యాల చెల్లింపులకు మార్గం సుగమం అయింది.  మూడు నెలలుగా స్తంభించిన టీఆర్‌టీ జీతభత్యాలు ఈ సమస్య పరిష్కారంతో త్వరలో అందేందుకు మార్గం సుగమం అయింది. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్‌ హరిచందనకు, డీఈవో రవీందర్‌కు, పాలమూరు జిల్లా డీఈవో ఉషారాణికి పీఆర్‌టీయూ టీఎస్‌ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కృతజ్ఞతలు తెలిపిన వారిలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిమ్మారెడ్డి, వైజనార్దన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు రఘువీర్‌, జనార్దన్‌ తదితరులు ఉన్నారు. తపస్‌ తరపున సంఘం నాయకులు శేర్‌ కృష్ణారెడ్డి, నర్సింలు, గోవింద్‌రెడ్డి, కుర్మయ్య, రవికుమార్‌, భాస్కర్‌రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. 


logo