బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Feb 15, 2020 , 00:27:07

పోలేపల్లి జనసంద్రం

పోలేపల్లి జనసంద్రం

కోస్గి : ‘ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగా చూడమ్మా’ అంటూ భక్తుల కేరింతలు, జయ జయ ధ్వానాలు ఒక వైపు, మేళతాళాలు డప్పు చప్పుళ్లు, సవారి నిండిన మహిళలు మరో వైపు ముదుకు నడుస్తుండగా పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవారం ప్రధాన ఘట్టమైన సిడే కార్యక్రమం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. సిడె కార్యక్రమం సాయంత్రం 5.35 నుంచి 6.00 గంటల వరకు శోభాయమానంగా కొనసాగింది. మొదట జల్ది ఉత్సవంలో భాగంగా దేవాలయంలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గుడికి సమీపంలో ఉన్న బావి దగ్గరికి మేళతాళాలు, కొమ్ము వాయిద్యాల మధ్య పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. బావిలో విగ్రహానికి అభిషేకం చేసిన తరువాత మళ్లీ గుడికి తీసుకొచ్చారు. గుడి ముందు కుంభం పోసిన తరువాత ఉత్సవ కమిటీ చైర్మన్‌ రామక్రిష్ణారెడ్డి, దేవస్థానం మేనేజరు రాజేందర్‌రెడ్డి, దేవాలయం మాజీ చైర్మన్‌ ముచ్చటి వెంకటేశ్‌  అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన రథంపైనున్న తొట్లెలో ఉంచి దేవాలయం చుట్టూ ఊరేగించారు. ఈ సమయంలో అమ్మవారి రథాన్ని లాగడానికి భక్తులు వేల సంఖ్యలో పోటీలు పడ్డారు. భక్తులు వేపాకు, పసుపు, గవ్వలు కలిపిన గవ్వల బండారును అమ్మవారిపై చల్లారు. సిడెను కనులారా తిలకించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. దర్శనం కోసం భక్తులు క్యూ కట్టడంతో దేవాలయం ముందు భారీ జన సందోహం కనిపించింది. అమ్మవారికి బోనం కుండలతో, మేక పోతులు, కోడిపుంజులతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పూనకం నిండిన మహిళల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు జాతరలో ఆకర్షణగా నిలిచాయి. జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాలు, మహారాష్ట్రలోని సోలాపూర్‌, భీవండి, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌ల నుంచి  రెండు లక్షల మందికి పైగా భక్తులు  జాతరకు హాజరయ్యారు.

జాతరలో గట్టి బందోబస్తు

ఎల్లమ్మ జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాయణపేట సీఐ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కోస్గి ఎస్సై మల్లారెడ్డితో పాటు వివిధ మండలాల ఎస్సైలు, పోలీసులు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతరలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌, కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు, చిన్న పిల్లలు తప్పిపోవడంతో ఆయా రాష్ర్టాలకు చెందిన పోలీసులతో మైకులో అనౌన్స్‌మెంట్‌ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

విస్తృతంగా ఆర్టీసీ సేవలు

ఎల్లమ్మ జాతరకు ఆర్టీసీ అధికారులు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపారు. పరిగి, తాండూరు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ డిపోలకు చెందిన బస్సులు వివిధ ప్రాంతాల నుంచి జాతరకు భక్తులను చేరవేశాయి.  భక్తులు జీపులు, ఆటోలు తదితర ప్రైవేటు వాహనాలపై కూడా తరలి వచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు భక్తులు గురువారం రాత్రే జాతరకు చేరుకుని శుక్రవారం సిడెను తిలకించి స్వస్థలాలకు బయలు దేరారు.  

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

జాతరలో దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 15 ట్యాంకర్లు ఏర్పాటు చేసి భక్తులకు నీటిని అందించారు. పీహెచ్‌సీ వైద్యులు రవీంద్ర యాదవ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

VIDEOS

logo