శుక్రవారం 29 మే 2020
Narayanpet - Feb 12, 2020 , 23:57:36

నువ్వా..నేనా..?

నువ్వా..నేనా..?

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. ప్రధానంగా అధ్యక్ష పదవి బరిలో అభ్యర్థులు మరింత ఉత్కంఠ నెలకొంది. ఆయా వార్డుల్లో చాలా వరకు ఇద్దరేసి సభ్యులు మాత్రమే డైరెక్టర్‌ స్థానాలకు పోటీ పడుతున్నారు. ఒక్క డైరెక్టర్‌ స్థానంలో ఒకటి నుంచి 8 గ్రామాలకు సంబంధించిన ఓటర్లున్నారు. వీరందరిని కలుస్తూ ఓట్లు అభ్యర్థించడం కొంత ఇరకాటంగానే ఉన్పప్పటికీ లెక్కచేయడం లేదు. ఓట్లు కొద్దిపాటిగా ఉన్నా ఇతర గ్రామాల లింకుతో అభ్యర్థులు ఓట్ల కోసం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 

ఏకగ్రీవాలకు దూరంగా...

జిల్లాలో 15 సొసైటీల్లో మెజార్టీ సంఘాల్లో కొన్ని వార్డులు ఏకగ్రీవమయ్యా యి.  ఒక్క స్థానం కూడా ఏకగ్రీవానికి నోచుకోకుండా అన్ని వార్డుల్లో నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. వనపర్తి, ఖిల్లాఘణపురం, తూంకుంట, కొప్పునూరు సంఘాల్లో ఒక్క డైరెక్టర్‌ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. దీంతో ఈ కేంద్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 44 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా రేచింతల సొసైటీలో పూరిస్థాయిలో 13 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగతా 11 సంఘాల్లో 1 నుంచి 5 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవాలు అయ్యాయి. వీటిలో పాన్‌గల్‌, పెద్దమందడిలో ఒక్కొక్క స్థానం, నాగవరంలో 2, రామక్రిష్ణాపురం, ఆత్మకూర్‌లో 3 చొప్పున, శ్రీరంగాపురం, గోపాల్‌పేటల్లో 4 డైరెక్టర్లు, పెబ్బేరు, కొత్తకోటల్లో 5 చొప్పున డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ప్యానల్‌ వారీగా పోటీ.. 

ఈ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకపోయినా ఆయా పార్టీల ననుసరించే ప్యానల్‌గా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డైరెక్టర్‌ స్థానాలకు మాత్రమే రిజర్వేషన్‌ వెసలుబాటు ఉంది. ఇక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్‌ లేదు. వీటి కోసం గతంలో పని చేసిన చైర్మన్లు మళ్లీ పీఠం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కొత్త అభ్యర్థులు సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో అవకాశాలు కలిసిరాని నాయకులు కూడా ఈ చైర్మన్‌ గిరిని దక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల చైర్మన్‌ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో అక్కడ వారి ప్యానల్‌ అభ్యర్థులను గెలుపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొత్తం 15 సంఘాల్లో 195 డైరెక్టర్‌ స్థానాలకు గాను 151 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు 385 మంది పోటీ పడుతున్నారు. అధ్యక్ష రేసులో ఉన్న వారు తమ గెలుపుతో పాటు మద్దతుదారులను గెలుపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. డైరెక్టర్‌గా గెలిచిన వారికే సంఘాల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశముంది. దీంతో అభ్యర్థులు హైరానా పడుతున్నారు.


logo