బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Feb 12, 2020 , 00:23:27

రైలు బడి

రైలు బడి

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: మండలంతోని చింతలపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల వరకు సర్కారు బడి కొనసాగుతున్నది. 102 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల వరండాలో ఐదు తరగతి గదులను అచ్చం రైలు బోగీల ఆకారంలో పెయింటింగ్‌తో తీర్చిదిద్దారు. చింతలపల్లి పాఠశాల ఐదో తరగతి విద్యార్థులు 2012 నుంచి ఏటా 6వ తరగతిలోకి వెళ్లేందుకు పోటీ పరీక్షల్లో పదుల సంఖ్యలో గురుకుల సీట్లు పొందడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే టాప్‌గా నిలుస్తున్నారు. అయితే పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు, విద్యావలంటీర్‌ విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతూ ఓ ప్రత్యేకతను చాటాలని నిశ్చయించుకున్నారు. ఆ దిశగానే  విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులలో మరింత రెట్టింపు ఉత్సాహం కలుగడంతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు పదును పెట్టారు.  గతేడాది 40మంది విద్యార్థులు 6వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష రాయగా 20 మంది విద్యార్థులు సీట్లు సాధించారు.

ఉపాధ్యాయ బృందానికి అభినందనలు

గతేడాది గురుకులంలో 20 సీట్లు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అభినందించారు. ఈ  సందర్భంగా గోడలపై రాయించిన వారి సంఖ్య, పెయింటింగ్‌ ఎమ్మెల్యే కంటపడింది. దీంతో విద్యార్ధుల చదువు ప్రగతిని పాఠశాల హెచ్‌ఎం కర్నె కృష్ణయ్యను ఎమ్మెల్యే  అడిగి వివరాలను తెలుసుకున్నారు. సంతృప్తి చెందిన ఎమ్మెల్యే బీరం పాఠశాలను మోడల్‌ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు తన నిధుల నుంచి రూ.5లక్షలు విడుదల చేశారు. ఆ నిధులతో పాఠశాల తరగతి గదులు ముందు భాగం రైలు బోగీలను తలపిస్తుంటే.. ఏ తరగతి విద్యార్థులకు ఆ తరగతి  బోధన పాఠ్యాంశాలలో పొందుపర్చిన ఆంశాలను గోడలపై దృశ్యాలను గీశారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌గా దృశ్యాలను చూపిస్తూ విద్యాబోధన చేస్తున్నారు.  ఎమ్మెల్యే విడుదల చేసిన నిధులతో సర్కార్‌ పాఠశాల కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా చదువులోనూ, వనరులతో సమూలంగా రూపురేఖలు మారాయి.


ప్రతి గదిలో గోడలపై అన్నీ బొమ్మలే..

పాఠశాల కార్యాలయ గదిలో గోడపై  మహత్మాగాంధీ,  జవహార్‌లాల్‌ నెహ్రూ బొమ్మలతో  దర్శనమిస్తాయి. ఐదో తరగతి గదిలో గ్రహాలు, ఉపగ్రహాలు, మానవుని జీర్ణాశయం, హృదయం(గుండె),  జ్ఞానేంద్రీయం, ఊపిరితిత్తులు, కిడ్నీలతో కూడిన బొమ్మలు వేశారు.  4వ తరగతిలో  ఆంగ్ల గ్రామర్‌ రాశారు. 3వ తరగతి గదిలో కొలతలు, ఇంగ్లిష్‌ పాఠ్యాంశాలకు సంబంధించిన మ్యాజిక్స్‌ బీన్స్‌, దాని పక్క గదిలో లైబ్రెరీ ఏర్పాటు చేశారు. 2వ తరగతి గదిలో కంప్యూటర్‌ గదిలో ప్రొజెక్ట్‌ ద్వారా పాఠాలు ఎలా బోధిస్తారనే ఆంశాలతో కూడిన బొమ్మలు, డిజిటల్‌ క్లాస్‌లతో నేటి కాలానికి అనుగుణంగా కంప్యూటర్‌ని ఎలా  వినియోగించాలనే ఆంశాలను గోడలపై గీశారు. బొమ్మల ఆధారంగా విద్యార్థులకు నేరుగా అర్థమౌతుందని పాఠశాల ఉపాధ్యాయుడు రబ్బానీపాషా వివరించారు. 1వ తరగతి గోడపై గణిత ప్రక్రియకు సంబంధించిన బొమ్మలతోపాటు వివిధ రకాల పండ్ల బొమ్మలను గీశారు. అదేవిధంగా వంట గదిపై పోషకాహారం అందించే ప్రక్రియను గోడపై గీశారు. మరో గదిపై 10 సూక్తులతో కూడిన నినాదాలు రాయించారు. విద్యార్థుల మరుగుదొడ్డి గోడపై విద్యార్థి పరిశుభ్రత ఎలా పాటించాలనే ఆంశాల బొమ్మలను గీయించారు.


logo