శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 11, 2020 , 00:31:27

సహకార బరిలో 191 మంది

సహకార బరిలో 191 మంది

  నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల ఘట్టం పతాక స్థాయికి చేరింది. నామినేషన్ల  ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగియడంతో మొత్తం 191 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మరికల్‌ మండలంలోని తీలేరు సింగిల్‌ విండోలోని అన్ని డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ తీలేరు విండోపై గులాబీ జెండాను ఎగురవేయనున్నది. 

234 మంది ఉపసంహరణ

 జిల్లాలోని 10 సింగిల్‌ విండోలలోని 130 డైరెక్టర్‌ స్థానాలకుగాను మొత్త 503 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో అధికారుల పరిశీలనలో పలు కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 468 నామినేషన్లలో సోమవారం పెద్ద ఎత్తున ఉపసంహరణ అయ్యాయి. అన్ని స్థానాలలో 234 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా  43  ఏకగ్రీవ స్థానాలు పోగా మిగిలిన 87 డైరెక్టర్‌ స్థానాలకుగాను 191 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికలు ఈనెల 15న  జరుగనుండడంతో మంగళవారం నుంచి ప్రచారం జరందుకోనుంది.

టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి తీలేరు 

 మరికల్‌ మండలం తీలేరు సింగిల్‌ విండో టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. ఈ సింగిల్‌ విండోలో ఉన్న 13 డైరెక్టర్‌ స్థానాలలో నామినేషన్ల దాఖలు రోజు వరకే 10 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన మూడు స్థానాలు సోమవారం ఏకగ్రీవమయ్యాయి. 9  డైరెక్టర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌, 4 స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది. మెజారిటీ స్థానాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ విండో అధికారాన్ని చేపట్టనున్నది. 

ఏకగ్రీవమైన ఇతర స్థానాలు

  నామినేషన్ల ఉపసంహరణల అనంతరం పలు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట-2, దామరగిద్ద-6, దమగ్నాపూర్‌-6, ధన్వాడ-5, ఊట్కూరు-5, నర్వ-1, మక్తల్‌-4, మాగనూరు-1చొప్పున ఏకగ్రీవాలు అయ్యాయి. కోస్గి సింగిల్‌ విండో పరిధిలో ఒక్క ఏకగ్రీవం జరగలేదు. ప్రతి స్థానానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు 13  స్థానాలకు 26 మంది బరిలో నిలిచారు.

 జోరందుకోనున్న ప్రచారం

 జిల్లాలో సింగిల్‌ విండో ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచి జోరందుకోనుంది. ఉపసంహరణల ప్రక్రియ సోమవారం ముగియడంతో రంగంలో ఉన్న అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సైతం అభ్యర్థుల తరపున ప్రచారాలు చేయనుండడంతో గ్రామాలు సందడి సందడిగా మారనున్నాయి.


logo