శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 08, 2020 , 01:06:04

మట్టిలో కలిసిపోవద్దు!

మట్టిలో కలిసిపోవద్దు!

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు.. మరణించిన ప్రతి ఒక్కరికి వారి సాంప్రదాయాల మేరకు అంత్యక్రియలు చేస్తారు. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ చనిపోయే వ్యక్తులను సైతం బతికించగలిగిన వారే వైద్యులు. శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో క్లిష్టమైన రోగాలకు కూడా మందులు కనిపెడుతున్నారు. ఇంతటి వైద్యం ఎలా సాధ్యమైందంటే పరిశోధనల వల్లే అని చెప్పాలి. అలాంటి పరిశోధనలకు వైద్య విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమయ్యే వస్తువే మానవ మృతదేహం. కానీ ప్రస్తుతం ప్రతిఒక్కరూ  అంత్యక్రియలు చేస్తూ పోతే ఇక పరిశోధనలకు ఎవరి పార్థీవదేహాలు లభిస్తాయి. ఇలాంటి సమస్యలకు  క్రమంగా పరిష్కారం లభిస్తోంది. సామాజిక బాధ్యతతో పలువురు మృతుల బంధువులు తమ వారి మృతదేహాలను వైద్య కళాశాలలకు అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అప్పగించి.. ఆదర్శంగా నిలిచారు. 

ఏటా పది మృతదేహాలు అవసరం

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఏటా 175 మంది విద్యార్థులకు అనాటమీ క్లాస్‌కు సంబంధించి కనీసం 10 మృతదేహాలు అవసరం. కానీ ఇప్పటివరకు ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య కళాశాల ప్రారంభించిన కొత్తలో మృతదేహాల కొరత వల్ల నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాల నుంచి తెప్పించుకున్నారు. 20 మంది వైద్య విద్యార్థులకు ఒక మృతదేహం అవసరం. కొరత ఉన్నప్పుడు ఎక్కువ మంది వైద్య విద్యార్థులు ఒకే మృతదేహంతో పరిశోధనలు చేయకతప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ చొరవతో మెడికల్‌ కళాశాలకు ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వారి వారి బంధువులు అప్పగించారు. చాలా మందికి ఈ సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు.  మెడికల్‌ కళాశాల, జనరల్‌ దవాఖాన ప్రారంభమైన రెండేళ్లలో ఇప్పటివరకు ఏడు మృతదేహాలను పరిశోధనలకు అప్పగించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, మిత్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్య విద్యార్థుల  విద్య, పరిశోధనలకు తమవంతు బాధ్యతను నిర్వర్తించారు. వివిధ కారణాల వల్ల మరణించిన ఏడుగురు తమ మరణం తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడుతున్నారు. వారి మృతదేహాలు భవిష్యత్‌కు ఉపయోగపడే పరిశోధనలకు ఊతమిస్తున్నాయి. ఎందరినో బతికించే వైద్యులను తయారు చేస్తున్నాయి. తాము చనిపోయినా ఇతరులను బతికించేందుకు ఉపయోగపడుతున్న కారణ జన్ముల గురించి..

VIDEOS

logo