శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 08, 2020 , 01:02:25

రైల్వే లైన్‌ వేయాల్సిందే..

రైల్వే లైన్‌ వేయాల్సిందే..

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలంగాణలోని రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కేంద్రం తప్పనిసరిగా కొత్తగా రైల్వే మార్గాలు వేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో కేంద్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు. అత్యంత వెనకబడిన ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కల్వకుర్తి, నల్లగొండలోని దేవరకొండ, సూర్యాపేట తదితర పట్టణాలను కలుపుతూ రైల్వేలైన్‌ వేయాలని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఈ మేరకు మన్నె వినతిపత్రం సమర్పించారు. పునర్విభజన చట్టం మేరకు 13వ షెడ్యూల్‌, సీ సెక్షన్‌, పేజీ నం.74,75 స్పష్టం చేసిన మేరకు తెలంగాణలోని ఇతర పట్టణాల్లో రైలు, రోడ్డు కనెక్టివిటీ పెంచాల్సి ఉందని గుర్తు చేశారు. కేంద్రం తమ కోసం కొత్తగా చేయాల్సిన అవసరం లేదని, చట్ట ప్రకారం తప్పకుండా రైల్వే లైన్‌ వేయాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన కర్ణాటకలోని యాద్గిర్‌ నుంచి నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, సూర్యపేట మీదుగా ఖమ్మం వరకు కొత్త రైల్వే లైన్‌ వేయాలన్నారు. ఈ లైన్‌ నిర్మాణం వల్ల ఇటు తెలంగాణకే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఉపయోగంగా ఉండనుందన్నారు. రెండు తెలుగు రాష్ర్టాలను ముంబైకి చేరువ చేసే ఈ రైల్వే లైన్‌ వల్ల కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న జాతీయ రహదారుల వెంట ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని ఎంపీ మన్నె అన్నారు. జాతీయ రహదారి 44, 167 వెంట ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ గతంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ను కలిసి చేసిన విజ్ఞప్తిని ఎంపీ మన్నె గుర్తుచేశారు. జాతీయ రహదారి 44 వెంట కొత్తూరు నుంచి గద్వాల, కొత్తూరు నుంచి రాయచూరు వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌కు మరో వినతిపత్రం సమర్పించారు.  

దేవరకద్రలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలి

కాచిగూడ-డోన్‌ జంక్షన్‌ నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రకు సమీపంలోనే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ, కురుమూర్తి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలొస్తారని.. ఈ మేరకు ఆ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు చాలాకాలంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సదుపాయం కోసం విన్నవిస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎంపీలు రాములు, వెంకటేశ్‌ ఉన్నారు. 

VIDEOS

logo