మంగళవారం 02 జూన్ 2020
Narayanpet - Feb 01, 2020 , 01:31:56

ఈ సారైనా.. పాలమూరుకు మేలు జరిగేనా..

ఈ సారైనా.. పాలమూరుకు మేలు జరిగేనా..
  • పెండింగ్‌ రైల్వే లైన్లకు మోక్షం లభించేనా..
  • పీఆర్‌ఎల్‌ఐకి నిధులు విదిల్చేనా..
  • కేంద్ర విద్యాలయాల మంజూరుపైనా ఆశలు
  • జనం చూపు కేంద్ర బడ్జెట్‌ వైపు

మహబూబ్‌ నగర్‌ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పార్లమెంటులో శనివారం ప్రవేశపెట్టే కేంద్రబడ్జెట్‌పై ప్రజలు ఎన్నోఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్ల పూర్తి, డబ్లింగ్‌, కొత్త రైళ్ల కేటాయింపుతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈసారైనా కేటాయింపులు ఉంటాయా..? అనే సందేహాలు నివృత్తి అయ్యే సమయం వచ్చేసింది.. నేడు పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నది. ఉమ్మడి పాలమూరు జిలావాసులందరి దృష్టీ కేంద్ర బడ్జెట్‌పైనే ఉన్నది. 


గద్వాల-మాచర్ల లైన్‌కోసం విజ్ఞప్తి చేశాం..

బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ర్టానికి ప్రయోజనం కలిగేలా ఎలా వ్యవహరించాలి... అనే అంశంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలందరూ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నాం. ఏ ప్రాంతం నుంచి ఎలాంటి సమస్యలున్నాయి... ఎలా చర్చలో పాల్గొనాలనే అంశంపై ఈ భేటీలో కేటీఆర్‌ మాకు దిశానిర్దేశం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ప్రతిసారి గద్వాల- మాచర్ల రైల్వే లైన్‌ పై విజ్ఞప్తి చేశాం. ప్రతిసారి వారి నుంచి సానుకూలత కనిపించింది కానీ ఇంతవరకు ఫలితం మాత్రం లేదు. ఈ బడ్జెట్‌లోనైనా ఈ రైల్వే లైన్‌కు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం మేం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాం. కేంద్రం ప్రత్యేకంగా నిధులైనా ఇస్తుందని ఆశిస్తున్నాం. కేంద్ర విద్యాలయాల కేటాయింపు కోసం ఇప్పటికే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని కలిశాం. ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నాం. 

- పోతుగంటి రాములు, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

కొత్త లైన్లు, రైళ్ల కోసం ఎదురుచూపులు

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు కొత్త రైళ్లు లేక దాదాపుగా రెండేండ్లు అవుతున్నది. కర్నూలు- గద్వాల- మహబూబ్‌ నగర్‌- కాచిగూడ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తారు. గద్వాల, మహబూబ్‌ నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వారికి ఉదయం వేళల్లో కనీసం రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల అవసరం ఉంది. అయినా కేంద్రానికి పట్టడం లేదు. ఇదే పరిస్థితి సాయంత్రం వేళ హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపూ ఉంటుంది. కాచిగూడ-గద్వాల- రాయిచూరు మధ్య కొత్తలైను ప్రారంభమై దశాబ్దం గడిచినా ఒక్క డెమో రైలు మాత్రమే తిరుగుతున్నది. ప్రయాణికుల సంఖ్య ఉన్నప్పటికీ మరో రైలు వేసే ప్రయత్నం జరుగడం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకునడం వల్లే కనీసం ఫలక్‌నుమా- మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి. 


తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితో 1997లో మంజూరైన దేవరకద్ర- మునీరాబాద్‌ రైల్వే పనులు కొనసాగుతున్నాయి. నిజాం కాలం నుంచి ప్రతిపాదనల్లో ఉన్న గద్వాల- మాచర్ల రైల్వే లైన్‌కు సంబంధించి కేంద్రం గత బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదు. ఇక ఎప్పటి నుంచో ప్రతిపాదనలకే పరిమితమైన కృష్ణా- వికారాబాద్‌, జడ్చర్ల- నంద్యాల రైల్వే లైన్‌లనూ ఇప్పటివరకు పూర్తిగా విస్మరిస్తూనే వస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలను కలిపే మహబూబ్‌నగర్‌- డోన్‌ డబ్లింగ్‌ లైన్‌ కోసం ఈ బడ్జెట్‌లో కనీసం నిధులు విడుదల చేస్తారని ఆశిస్తున్నారు. కొత్తగా యాద్గిర్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ మీదుగా ఖమ్మం వరకు రైల్వే లైన్‌ కోసం నిధుల విడుదల చేయాలని మహబూబ్‌ నగర్‌ ఎంపీ కేంద్ర రైల్వే మంత్రికి వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్‌లోనైనా కేటాయిస్తారని స్థానికులు ఆశపెట్టుకున్నా రు. ఫలక్‌నుమా- మహబూబ్‌ నగర్‌ డబ్లింగ్‌, ఎలక్ట్రిఫికేషన్‌ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేస్తామని జీఎం గజానన్‌ మాల్యా ప్రకటించారు. అయితే ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే తప్ప పనులు ఈ ఏడాది అంతానికి పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 


ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌ను ఈసారైనా అనుసంధానిస్తారా..

నైజాం పాలనలో రాయిచూరు నుంచి గద్వాల మీదుగా గుంటూరు జిల్లా మాచర్లకు రైల్వే లైన్‌ వేయాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో దాదాపు 185 కిలోమీటర్ల మేర నిర్మించాలని ఇప్పటికే పలుమార్లు సర్వే కూడా పూర్తి చేసినప్పటికీ కేంద్రం నిధులు విదిల్చలేదు. ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌ను కలిపే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భువనేశ్వర్‌, విశాఖ, విజయవాడ ప్రాంతాలకు ముంబయి చేరుకునేందుకు దగ్గర మార్గంగా మారనుంది. దీనివల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతుంది. గద్వాల నుంచి కొత్తకోట, వనపర్తి, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ నుంచి గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వే లైన్‌ నిర్మిస్తే వెనకబడిన ప్రాంతాలు ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయి. కొత్తగా ఏర్పడిన వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రాలకు రైల్వే సదుపాయం కలుగనుంది. వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రాలతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ నియోజకవర్గ కేంద్రాలు, అనేక మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీలకు రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. సుమారు రూ. వెయ్యికోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించాలని స్థానికులు కోరుతున్నారు. 


ఏ చిన్న అవకాశాన్నీ వదలలేదు

ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఏ సందర్భం వచ్చినా కేంద్ర మంత్రులను కలిసి స్థానిక సమస్యలపై వారితో చర్చించాం. అనేక వినతి పత్రాలు కూడా సమర్పించాం. మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఐటీ పార్క్‌, మెడికల్‌ కళాశాలకు దగ్గరున్న దివిటిపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు నిధులివ్వాలని కోరాం. ఈ ఏడాది చివరి నాటికి మహబూబ్‌ నగర్‌- కాచిగూడ డబ్లింగ్‌ పనులు పూర్తి చేయడంతో పాటు సమాంతరంగా మహబూబ్‌నగర్‌- కర్నూల్‌ దిశగా కూడా డబ్లింగ్‌ పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని అడిగాం. కొత్తగా యాద్గిర్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ మీదుగా ఖమ్మం వరకు రైల్వే లైన్‌ మంజూరు చేయాలని కోరాం. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని రైల్వే లైన్లకు నిధులు కేటాయించాలన్నాం. ఈ బడ్జెట్‌లో పాలమూరుకు మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నాం.

- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ, మహబూబ్‌నగర్‌ 


కేంద్ర విద్యాసంస్థల కోసం ఎదురుచూపులు..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను 5 జిల్లాలుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాల్లో పాలన కూడా ప్రారంభం అయ్యి దాదాపు నాలుగేండ్లు గడిచినా కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు నోచలేదు. పాత మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలో ఉన్న నవోదయ విద్యాలయం ప్రస్తుతం నాగర్‌ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఉంది. అంటే ఇక నాగర్‌కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు కొత్తగా ఏర్పాటు చేయాలి. దీంతో పాటు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో కేంద్రీయ విద్యాలయం నడుస్తున్నది. మిగతా జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ ప్రస్తుతం మహబూబ్‌ నగర్‌లో మాత్రమే ఉంది. వీటిని సైతం అన్ని జిల్లాలకు ఏర్పాటు చేయాల్సి ఉంది.  


logo