శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 01, 2020 , 01:29:17

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి
  • కలెక్టర్‌ వెంకట్రావు
  • జిల్లా దవాఖానను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌
  • జనరిక్‌ మందుల దుకాణం పరిశీలన
  • రోగులతో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా!

నారాయణపేట టౌన్‌ : జిల్లా దవాఖానాకు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగయిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌వు వైద్యులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా దవాఖానాను కలెక్టర్‌ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా దవాఖానాలో రిజిస్టర్‌లను పరిశీలించిన అనంతరం పలు వార్డులను తిరిగి పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులకు వైద్యులు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. సమయానికి వైద్యులు వస్తున్నారా, చికిత్సలు అందిస్తున్నారా అనే వివరాలపై ఆరా తీశారు. స్కానింగ్‌ తీయించుకోవడానికి వచ్చిన మహిళలతో మాట్లాడారు. దవాఖానా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపా రు. దవాఖాన సమీపంలో ఉన్న జనరిక్‌ మందుల దుకాణాన్ని తనిఖీ చేసి జెనరిక్‌ మందులనే అమ్మాలని షాపు యజమానికి చెప్పారు. ఇతర మందులను విక్రయిస్తే సీజ్‌ చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌, వైద్యులు రంజిత్‌కుమార్‌తో పాటు సిబ్బంది ఉన్నారు. 


పల్లె ప్రగతిపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

నారాయణపేట టౌన్‌ : పల్లె ప్రగతిపై నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. జిల్లాలోని గ్రామాలలో నిరక్షరాసులను అక్షరాసులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా  పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికలకు స్థలాలను కేటాయించని గ్రామాలలో వెంటనే స్థలాలను గుర్తించాలన్నారు. ప్రతి గ్రా మ పంచాయతీలలో చెత్త బుట్టలను పంపిణీ చేయాలన్నారు. ప్రజలు చెత్తను ఇంటి పరిసరాలలో పారవేయకుండా చెత్త బుట్టలలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో వేయాలన్నారు. చదువురాని వారికి చదువు వచ్చిన వారు చదువును నేర్పించాలని సూచించారు. హరితాహారం నాటిన ప్రతి మొక్కను నీటిని పోసి బతికించాలని, ప్రతి ఇంటికీ ఇంకు డు గుంతను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అన్ని కార్యాలయాలలో ఫైళ్లను ఈ ఆఫీసు ద్వారానే పంపించాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో శ్రమదానాలు నిర్వహించి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఎంపీవోలు ఎప్పటికప్పుడు గ్రామాలకు వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో మురళి, డిప్యూటీ సీఈవో సిద్దిరామప్ప, జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


logo