విశాఖ టు శ్రీలంక వయా హైదరాబాద్

వారంతా తమిళనాడుకు చెందిన వారు.. 8 మంది ముఠాగా ఏర్పడి గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు. వారి వ్యాపారం రోజురోజుకూ వృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి గంజాయి సంచులకు జీపీఎస్ అనుసంధానం చేసి అక్రమంగా రామేశ్వరానికి.. అక్కడి నుంచి నౌకల్లో శ్రీలంకకు తరలించి విక్రయించి రూ.లక్షల ఆర్జించేవారు. ఇదే క్రమంలో ఈనెల 4న ఇన్నోవాలో గంజాయిని తరలిస్తుండగా.. భూత్పూర్ మండలం తాటికొండ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వాహనంలోని 180 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రెండు ఇన్నోవాలు స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలను ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు.
- మహబూబ్‌నగర్ క్రైం
మహబూబ్‌నగర్ క్రైం : ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీలంక దేశానికి నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని సక్కిమంగళం మండలంలోని మిద్దెల్ ప్రాంతానికి చెందిన పీ సతీశ్ డ్రైవర్‌గా పనిచేస్తూ అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ విక్రయించేవాడ న్నారు. అతను 2009-2014 సంవత్సరాల్లో గంజాయి విక్రయించిన కేసులో జైలుకు వెళ్లి 2018లో జైలు నుంచి విడుదలయ్యార న్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గంజాయి విక్రయాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులతో పరిచయం పెంచుకొని అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంకకు గంజాయిని రవాణా చేస్తూ లక్షల రూపాయలు సంపాదించారని తెలిపారు.
ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి..
ఈ క్రమంలో పీ సతీశ్‌తో పాటు తమిళనాడుకు చెందిన కె.కళ్యాణ్ హైదరాబాదులో స్థిరపడ్డాడ న్నారు. వీరితోపాటు తమిళనాడుకు చెందిన శివనేశ్వరన్, జి.సుదర్శన్, ఎం.అజిత్, రాము, మూర్తి, రాంరెడ్డిలతో కలిసి ఏపీలోని విశాఖపట్నం నుంచి తమిళనాడులోని రామేశ్వరానికి తరలిస్తార న్నారు. అక్కడి నుంచి పడవలలో శ్రీలంకకు గంజాయిని తరలిస్తారన్నారు. జీపీఎస్ చిప్పులను గంజాయి సంచులకు అమర్చి, శ్రీలంక దేశానికి చెందిన ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తులకు జీపీఎస్ సిస్టం ద్వారా గంజాయి ఉన్న డబ్బాలను అందజేస్తారన్నారు. ఏపీలోని విశాఖపట్నంలో కిలో గంజాయి రూ.6 వేలు, హైదరాబాదులో కిలో గంజాయి రూ.11 వేలు, చెన్నైలో కిలో గంజాయి రూ.12 వేలు, శ్రీలంకలో కిలో గంజాయి రూ.18 వేలకు విక్రయిస్తారన్నారు.
భూత్పూర్ ఘటనతో వెలుగులోకి..
ఈ నెల 3న విశాఖపట్నంలోని సీలేరు నుంచి మధురైకి గంజాయిని రవాణా చేసేందుకు తమిళనాడుకు చెందిన పీ సతీశ్, ఏ-1, ఏ-2 కళ్యాణ్, ఏ-3 శివనేశ్వరన్, ఏ-4 ఎం.అజిద్, ఏ-5 జి.సుదర్శన్‌లు ఏపీలోని విశాఖపట్నం జిల్లా సిలేరు గ్రామం నుంచి ఏపీ 11 ఏఈ 7555 ఇన్నోవా వాహనంలో బయలు దేరారన్నారు. ఈ క్రమంలో ఈనెల 4న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భూత్పూర్ హైవేపై తాటికొండ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఈ ఇన్నోవా కారు ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు కావడంతో కారులో ఉన్న డ్రైవర్ ఎం.అజిత్. శివనేశ్వరన్కు గాయాలయ్యా యన్నారు. వీరిని ఎవరైనా పట్టుకుంటే తప్పించేందుకు వెనకాలనే మరో ఇన్నావా కారులో ఏ-1 సతీష్, కళ్యాణ్‌లు వచ్చారన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఏ-1 నిందితుడు పీ.సతీష్‌కు తెలుపగా అతను ఘటనా స్థలానికి చేరుకొని తన ఇన్నోవా కారులో శివనేశ్వర్ను తీసుకొని పరారయ్యాడన్నారు. ముందు కారులో ఉన్న డ్రైవర్ అజిత్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడే వదిలేసి వెళ్లారన్నారు. ఈ కారు ప్రమాదంపై భూత్పూర్ ఎస్సై భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా కారులో 180 కేజీల గంజాయి సంచులు ఉన్నట్లు గుర్తించారన్నారు. కారులో గాయాలపాలైన అజిత్‌ను దవాఖానకు తరలించి వైద్య సేవలందించా రన్నారు. ఈ విషయం సీఐ కిషన్‌కు తెలుపగా దర్యాప్తు చేపట్టారన్నారు. గురువారం పీ.సతీష్, కె.కళ్యాణ్, జీ సుదర్శన్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా శ్రీలంకకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణా చేసి డబ్బులు సంపాదించినట్లు తెలిపారన్నారు. ఈ మేరకు నలుగురు నిందితులు సతీశ్, కళ్యాణ్, అజిత్, సుదర్శన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులైన శివనేశ్వరన్, రాము, మూర్తి, రాంరెడ్డిలను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి రూ.21 లక్షల విలువ చేసే గంజాయి, రెండు ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ కిషన్, ఎస్సై రాజేందర్, ఎస్సై భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్, రహీంలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్, భూత్పుర్ సర్కిల్ సీఐ కిషన్, ఎస్సై భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు.