గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 18, 2020 , 03:47:36

టీఆర్‌ఎస్‌ వెన్నంటే ప్రజలు

 టీఆర్‌ఎస్‌ వెన్నంటే ప్రజలు‘రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌ వెన్నంటే ఉన్నారు.. సీఎం కేసీఆర్‌ అంటే వారికి ఎంతో విశ్వాసం.. మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత కూడా వారిదే’.. అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేటలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. నారాయణపేటను జిల్లా చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి.. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఒకసారి బేరీజు వేసుకొని చూడాలన్నారు. బల్దియా ఎన్నికల గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు కావాలని ఆయన సూచించారు.

- పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత కూడా వారిదే.. టీఆర్‌ఎస్‌ వెన్నంటే పజలు
- నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ
- ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం
- తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని పరిశీలించండి
- నారాయణపేట మున్సిపాలిటీకి జిల్లా సొబగులు
- ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

 నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : అలుపెరుగకుండా అభివృద్ధి చేస్తున్నాం..జిల్లాను సాధించుకోగలిగాం.. నారాయణపేటను మున్సిపాలిటీగానే కాదు జిల్లా కేంద్రంగాను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అభివృద్ధి సజావుగా సాగేందుకు టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతలను ప్రజలే స్వీకరించాలని పేట ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న పేట మున్సిపాలిటీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకు ఎలా వుండేది.. వచ్చాక అభివృద్ధ్ది ఎలా ఉంది?
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి : నిజాం కాలంలోనే  నారాయణపేట మున్సిపాలిటీగా ఏర్పాటయ్యింది. ఆ తరువాత సమైక్య పాలనలో జరిగిన అభివృద్ధి నామ మాత్రమే. కులాలు, మతాల పేర్లతో అధికారంలోకి వచ్చి తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారు తప్పా ఎవరూ పేట అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలు లేవు. పేటలో డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉం డేది.  తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. గ్రేడ్‌-3గా ఉన్న మున్సిపాలిటీని గ్రేడ్‌-2గా మార్చగలిగాం. ఇప్పటికే రూ.129 కోట్లలో పట్టణ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం.

పేట ఇప్పుడు మున్సిపాలిటీయే  కాదు, జిల్లా కేంద్రం అభివృద్ధ్ది కోసం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు?

మున్సిపాలిటీగా అభివృద్ధి చేసుకుంటూనే జిల్లా కేంద్రానికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, జిల్లా దవాఖాన స్థాయి పెంపుతో పాటు మిగతా భవనాల నిర్మాణాలను త్వరలోనే చేపడుతాం. పేటలో ఏకో పార్కును ఏర్పాటు చేసి పర్యాటక స్థలంగా  తీర్చిదిద్దుతాం.

ఈ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించారా..?

పేటలో వార్డుల వారీగానే కాకుండా మున్సిపాలిటీ మొత్తానికి సంబంధించి మేనిఫెస్టోను రూపొందించాం. ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసి వార్డుల వారీగా ప్రజలకు చేరవేస్తున్నాం. ఏ పనులైతే అవసరమో వాటినే మా మేనిఫెస్టోలో పొందు పరిచాం.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. వార్డుల వారీ గా ఆసక్తి ఉన్నవారిని గుర్తించడమే కాకుండా వారి పనితీరు, ప్రజలతో ఉన్న సంబంధాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. అలాగే అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చాం. రిజర్వు స్థానాలలోనే కాకుండా జనరల్‌ స్థానాలలోనూ పోటీ చేసే అవకాశాలను కల్పించాం. మహిళలకు సగానికన్నా ఎక్కువ స్థానాలలో పోటీ చేసే అవకాశాలను కల్పించాం.

ఈ ఎన్నికలలో ఏయే అంశాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు తోడ్పడతాయని భావిస్తున్నారు?

మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయి. పట్టణంలో జరిగిన పనులు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్ల లబ్ధిదారులు పట్టణంలో పెద్ద మొత్తంలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే టీఆర్‌ఎస్‌ను ప్రజలు తమ సొంత పార్టీగా భావిస్తున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యరుల్థను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ ఇవ్వవచ్చని భావిస్తున్నారు?

మాకు ఏ పార్టీ పోటీకాదు. మా అభ్యరుల్థను ఎదుర్కునే సత్తాలేక నైతిక విలువను మరిచి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జాతీయ పార్టీల నాయకులు జతకట్టి కుట్రలు చేస్తున్నారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డకుంటూ ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం లేక ఒప్పందాల ప్రకారం వార్డులలో నామినేషన్లు వేశారు. అలాంటి వాళ్ల సంగతి ప్రజలే తేలుస్తారు.

మొత్తం 24వార్డులలో  టీఆర్‌ఎస్‌కు ఎన్ని స్థానాలు రావచ్చు ?

 మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లో మేము విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రజల మద్దతు, చేసిన అభివృద్ధి పనులే మా అభ్యర్థులను గెలిపిస్తాయి.

చివరగా ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తి ఏమిటీ ?

మన జిల్లా కేంద్రం.. మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నా.. అన్నిస్థానాలలో టీఆర్‌ఎస్‌ గెలువడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి జరుగుతుందని ఓటర్లు గుర్తించారని, దీంతో పేట మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయం.


VIDEOS

logo